తమ పార్టీ, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారాలు, నిరాధార ఆరోపణలు చేస్తే ఇకపై కఠిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ స్పష్టం చేసింది.
ఈ మేరకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది.
రాజకీయాల పవిత్రతను దెబ్బతీయడానికి కొందరు కుట్రపూరిత ప్రచారాలను వృత్తిగా మార్చుకున్నారని జనసేన పేర్కొంది. ముఖ్యంగా కొన్ని ప్రచార మాధ్యమాలు ఉసరవెల్లుల్లా మారి, జరిగిన విషయాలను వక్రీకరించడం, జరగని విషయాలను జరిగినట్టుగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది.
ప్రజలు నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించలేని స్థాయిలో ప్రచార కాలుష్యం పెరుగుతోందని, ఇది రాజకీయ వ్యవస్థకు, సమాజానికి ప్రమాదకరంగా మారుతోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన పార్టీపై ఎలాంటి అవాస్తవ ప్రచారాలు చేసినా వెంటనే పోలీస్ కేసులు నమోదు చేసి, న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది. తప్పుడు ప్రచారం చేసే వారు ఎవరైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవని జనసేన స్పష్టం చేసింది.

