Balakiishna: 'ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు అనువైన అందమైన లొకేషన్లు ఉన్నాయని.. వాటిని దర్శక, నిర్మతలు సద్వినియోగం చేసుకోవాలని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.
విజయవాడలో ఏపీ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ది సంస్థ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. 'తెలుగు రాష్ట్రాల్లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది చెందాలి. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారిస్తున్నారు. నేడు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా భరత్ భూషణ్‌తో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. తెలుగు సినిమా అభివృద్ధి కోసం రెండు రాష్ట్రాల్లో ఎఫ్‌డీసీలు కలిసే పని చేస్తాయి'.
'నిజానికి 70శాతం కలెక్షన్లు ఏపీ నుంచే వస్తాయి. ఇక్కడా మంచి లొకేషన్లు ఉన్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాలలో అనేక సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్‌లు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తున్నాయి. షూటింగులకు అనువుగా ఉండే ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. షూటింగ్‌కు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం ఇస్తోంది. సినిమా రిలీజైతే ఎలా ఉందనే పరిస్థితి నుంచి సినిమాను బ్రతికించుకోవాలనే పరిస్థితికి సినిమా వచ్చింది'.
'టెక్నాలజీలేని రోజుల్లోనే సినిమా షూటింగ్ త్వరగా పూర్తయ్యేది. నేడు టెక్నాలజీ పెరిగాక చాలా ఆలస్యం అవుతున్నాయి. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ధియేటర్లలో సినిమాలు లేక.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి చూసి జాలేస్తోంది. హీరోలు సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు చేయాలి. నేను సందేశాత్మక సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నా. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు త్వరలోనే ప్రకటిస్తాం. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సినీ పరిశ్రమకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నా'మని అన్నారు.

