Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత్‌పై స్బేర్ బ్యాంక్ దృష్టి.. లోకేష్ కీలక ప్రతిపాదనలు

భారత్‌పై స్బేర్ బ్యాంక్ దృష్టి.. లోకేష్ కీలక ప్రతిపాదనలు

TeluguBulletin.com 2 weeks ago

ష్యా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా భారత్‌లో బ్యాంకింగ్, డిజిటల్ సేవలు, కృత్రిమ మేధస్సు, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని విస్తరించాలంటూ లోకేష్ పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

భారతదేశంలోని బ్యాంకింగ్, రిటైల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలకు స్బేర్ బ్యాంక్ అభివృద్ధి చేసిన గిగాచాట్ ఎల్‌ఎల్‌ఎం సేవలను విస్తరించాలని మంత్రి కోరారు. అలాగే యూపీఐ నెట్‌వర్క్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు స్బేర్ బ్యాంక్ రూపొందించిన ఆధునిక వాయిస్ రికగ్నిషన్, బయోమెట్రిక్ యాంటీ-ఫ్రాడ్ టెక్నాలజీని భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అనుసంధానించేందుకు సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

భారత్‌లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ కార్యక్రమాల్లో భాగంగా ప్రిడిక్టివ్ అనలిటిక్స్, స్మార్ట్ ట్రాన్సిట్ సర్వైలెన్స్, డిజిటల్ భద్రతా వ్యవస్థలను విస్తరించే అవకాశాలను కూడా చర్చించారు. ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్, ఏఐ నిపుణులను తయారుచేసేందుకు స్బేర్ బ్యాంక్ నిర్వహిస్తున్న "స్కూల్ 21" కోడింగ్ అకాడమీలను భారతదేశంలోని ప్రధాన విద్యా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.

విశాఖపట్నం కేంద్రంగా ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు రూపాయి-రూబుల్ వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఎగుమతిదారులకు వ్యవస్థీకృత రుణ సదుపాయాలు కల్పించాలని లోకేష్ కోరారు.

సమావేశంలో స్పందించిన ఆల్బర్ట్ యెఫిమోవ్, భారత్‌లో న్యూఢిల్లీ కార్యాలయం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య ఫైనాన్స్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నామని తెలిపారు. బెంగళూరులోని ఐటీ హబ్ రూపాయి-రూబుల్ వాణిజ్య వ్యవస్థల సమన్వయ కేంద్రంగా పనిచేస్తోందని చెప్పారు. న్యూఢిల్లీ, ముంబై శాఖలు వ్యూహాత్మక వాణిజ్య కారిడార్లలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

అంతర్జాతీయ బ్యాంకింగ్ నెట్‌వర్క్ ద్వారా భారీ లిక్విడిటీ, డిజిటల్ భద్రత, అంతర్జాతీయ వాణిజ్య సలహా సేవలను అందిస్తున్నామని పేర్కొన్న ఆయన, మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ నియంత్రిత బ్యాంకుల్లో ఒకటైన స్బేర్ బ్యాంక్ ప్రస్తుతం 110 మిలియన్లకు పైగా రిటైల్ ఖాతాదారులు, 3.5 మిలియన్ల కార్పొరేట్ ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారీ ఆదాయాన్ని నమోదు చేసిన ఈ బ్యాంక్, 12 వేలకుపైగా శాఖలతో ప్రతిరోజూ కోట్లాది డిజిటల్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin