Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో సమాధానం.. పవన్ కీలక వ్యాఖ్యలు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో సమాధానం.. పవన్ కీలక వ్యాఖ్యలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకప్పుడు "ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్‌పోర్ట్ ఏంటి?" అంటూ విమర్శించిన వారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే సమాధానమని ఆయన వ్యాఖ్యానించారు.

శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో మూడు పార్టీల కూటమి ఏర్పడాలని తాను బలంగా కోరుకున్నది అభివృద్ధి కోసమేనని చెప్పారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి, భోగాపురం వంటి అంతర్జాతీయ విమానాశ్రయం సాకారం కావడానికి కూటమి ప్రభుత్వం దోహదపడిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగాలంటే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అవసరమని అన్నారు.

భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ప్రతి తెలుగు వాడికి గర్వకారణమని పవన్ తెలిపారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల పేర్లు ఇలాంటి జాతీయ ప్రాజెక్టులకు పెట్టడం వారికి నిజమైన నివాళి అని అన్నారు.

ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా రూ.17,435 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని పవన్ చెప్పారు. రహదారుల అనుసంధానం, ఇంధన రంగంలో మౌలిక సదుపాయాల విస్తరణ, పరిశ్రమలకు అవసరమైన వసతులు పెరగడంతో యువతకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కేవలం ప్రకటనలతో కాదు.. మౌలిక సదుపాయాల నిర్మాణంతోనే సాధ్యమవుతుందని అన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో భారీ అభివృద్ధి ప్రాజెక్టులు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, జాతీయ రహదారుల పనులు, అమరావతి అభివృద్ధి, రాయలసీమలో మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రగతికి బలమైన పునాదులుగా నిలుస్తాయని పవన్ వివరించారు. అలాగే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కూడా ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చనున్నదని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కొందరు వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిని అవమానించడం బాధాకరమని అన్నారు. మోదీ దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవలో నిమగ్నమైన నాయకుడు నరేంద్ర మోదీ అని పవన్ కొనియాడారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు, అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠ పెరగడం ఆయన నాయకత్వ ఫలితమేనని చెప్పారు. అలాంటి నాయకుడికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని, "మేమంతా మీ వెంటే ఉన్నాం" అనే నమ్మకాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు.

యువత దేశ భవిష్యత్తుకు గొప్ప వనరని పేర్కొన్న పవన్.. పిల్లలకు మంచి సంస్కారం, విలువలు నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. దేశాన్ని ముందుకు నడిపించడం ఎంతో పెద్ద బాధ్యత అని, అలాంటి బాధ్యతను నిర్వర్తిస్తున్న నాయకత్వానికి ప్రజల మద్దతు అత్యంత అవసరమని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin