బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా తెలంగాణ పోలీసుల విచారణకు హాజరయ్యారని తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన బండి సంజయ్, "నా కుమారుడైనా, సాధారణ పౌరుడైనా చట్టం ముందు అందరూ సమానమే" అని పేర్కొన్నారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నాడని వెల్లడించారు.
అందుబాటులో ఉన్న ఆధారాలను న్యాయ నిపుణుల ముందుంచి చర్చించిన తరువాత, చట్టపరమైన ప్రక్రియ ద్వారానే ఈ అంశాన్ని ఎదుర్కోవాలని సూచించారని చెప్పారు. అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరించడం, న్యాయవ్యవస్థను గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
కోర్టు విచారణ కొనసాగుతున్నప్పటికీ, వచ్చే వారం ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయ బృందం సూచనలు ఉన్నప్పటికీ విచారణకు సహకరించడంలో ఎలాంటి సందేహం ఉండకూడదని తాను భావించానని బండి సంజయ్ వెల్లడించారు.
న్యాయ వ్యవస్థపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, న్యాయం ఆలస్యమవొచ్చు కానీ తప్పకుండా జరుగుతుందని పేర్కొన్నారు. తన సందేశం చివరలో "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్" అనే సంస్కృత సూక్తిని కూడా ఉటంకించారు.

