Chiranjeevi Birthday Special: చిరంజీవి అంటే చిన్న పిల్లలకి చాలా ఇష్టం. తన సినిమాలతో ఇంటిల్లపాదినీ అలరించే చిరంజీవి చిన్నపిల్లలను ఆకట్టుకోవడంలో మరింత సక్సెస్ అయ్యారు.
అందుకు కారణమైన సినిమాల్లో ప్రముఖమైంది 'పసివాడి ప్రాణం'. 1987లో వచ్చిన ఈ సినిమా కథ చిరంజీవి-చిన్నారి మధ్య సెంటిమెంట్. నాటి పిల్లల్ని ఆకట్టుకోవడం, చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ ఇవన్నీ చిరంజీవిని తమ ఇంట్లో వ్యక్తిగా, తమకు ఇష్టమైన హీరోగా మలిచేశాయి. దీంతో అప్పటి చిన్నపిల్లలే తర్వాతి రోజుల్లో చిరంజీవి ఫ్యాన్స్ గా.. మెగా ఫ్యాన్స్ గా మారిపోయారు.
'పసివాడి ప్రాణం' ఫక్తు చిన్నపిల్లల సినిమా. సినిమాలో చిన్నారిగా నటించిన సుజితలో తమను తాము చూసుకున్నారు పిల్లలు. సహజంగా తనలోని కామెడీ టైమింగ్ ను సినిమాలో జోడించి అలరించి.. చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక్ బ్రేక్ డ్యాన్స్ పాటతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని మైమరపించేశారు. ధియేటర్లు హోరెత్తిపోయాయి. తొలిసారి ఓ హీరో బ్రేక్ డ్యాన్స్ వేసి ట్రెండ్ సెట్ చేయడం మెగాస్టార్ తోనే సాధ్యమైంది. అప్పటినుంచీ తెలుగు సినిమాల్లో బ్రేక్ డ్యాన్స్ పాటలు తప్పనిసరి అయిపోయాయి.
చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్ గురించి నేటి మెగాఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కొత్త తరం చూస్తున్నారు కానీ, ధియేటర్లో తెరపై చిరంజీవి చేసే మ్యాజిక్ చూసిన నాటి చిన్నారులు అదృష్టవంతులు. పసివాడి ప్రాణంలో అదే చూసుకున్నారు. ఇది మన కథే.. మన చిరంజీవే అని మురిసిపోయారు. ఫలితంగానే చిన్నపిల్లల్లో చిరంజీవిపై విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. Gen Z మాత్రమే కాదు.. నేటి తరం పిల్లలు చూసినా ముచ్చటపడే సినిమా పసివాడి ప్రాణం. అంతగా అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. చిరంజీవి కెరీర్లో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాతో చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ట్రేడ్ సర్కిల్స్ లో చిరంజీవి సినిమాపై లెక్కలు మారిపోయాయి. వచ్చే ప్రతి చిరంజీవి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇకపై వచ్చే ప్రతి సినిమాలో చిరంజీవి ఏతరహా డ్యాన్సులు, ఎంత కొత్తగా వేశాడంటూ ప్రేక్షకులు ఆసక్తిగా చూడటం ప్రారంభమైపోయింది. చిరంజీవి డేట్స్ కోసం నిర్మాతల క్యూలు, టేబుల్ ప్రాఫిట్స్ ప్రారంభమైపోయాయి. దర్శకులకు చిరంజీవి సినిమా దొరికితే పండగే. చిరంజీవిని పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా మార్చేసిన సినిమాల్లో పసివాడి ప్రాణం ఒకటి.

