Chiranjeevi Birthday Special: మాస్, కమర్షియల్ హీరోగా తిరుగులేని ఇమేజ్ తో రాణిస్తున్న చిరంజీవికి.. తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించే సినిమాలు కూడా చేశారు.
అందులో ప్రముఖంగా చెప్పుకునే సనిమా 'ఆపద్బాంధవుడు'. కళాత్మక చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా అప్పటివరకూ చిరంజీవి-విశ్వనాధ్ కాంబోలో వచ్చిన సినిమాల్లో అగ్రగామిగా నిలిచిందని చెప్పాలి. మాధవ పాత్రలో చిరంజీవి నటించిన తీరుకు ప్రేక్షకులు ధియేటర్లలో కంటతడి పెట్టారంటే చిరంజీవి ఏస్థాయిలో తన నటనతో మెప్పించారో అర్ధం చేసుకోవచ్చు.
గోవులు పెంచే వ్యక్తిగా, సామాన్య జీవితం గడిపే మాధవ పాత్రలో చిరంజీవి నటించారు. సినిమా ఆసాంతం ఎక్కడా రౌద్రం, ఆవేశం ఉండవు. నాటకాల మీద ఇష్టం.. ముఖ్యంగా శివుడి పాత్రలో నటిస్తూ అలరించారు. తూగో (తూర్పు గోదావరి జిల్లా)లో తనను మించిన శివుడి వేషధారి లేరని.. ఎవరైనా పొగిడితే ఉబ్బితబ్బిబ్బిపోయే సరదా పాత్రలో కూడా రాణించారు. తనను ఆదరించిన పెద్దాయన మృతి చెందినప్పుడు పడవలో గోదావరి నది దాటుకుని వచ్చి మట్టితో శివుని విగ్రహం చేసి మాట్లాడే సన్నివేశంలో చిరంజీవి నటన నభూతో.. అనాల్సిందే.
తనకు మతి స్థిమితం సమస్య లేకపోయినా.. మతి స్థిమితం లేనట్టుగానే ఆసుపత్రిలో చిరంజీవి ప్రదర్శించిన నటనను ఎంత చెప్పినా తక్కువే. ఓ మాస్ హీరోలో ఈస్థాయి రియలిస్టిక్ యాక్టర్ ఉన్నాడా అనిపించేస్థాయిలో చిరంజీవి నటన ఉంటుంది. సినిమాలో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన సన్నివేశాలివి. సినిమా చూస్తున్నంతసేపూ ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్టే అందమైన గోదావరీ నదీ తీరాలతో ఆకట్టుకుంటుంది. వీనులవిందైన పాటలు ఇప్పటికీ అలరించేలా ఉంటాయి. చిరంజీవి నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తృటిలో మిస్సవడం బాధించేదే. కమర్షియల్ సక్సెస్ కాకున్నా చిరంజీవి కెరీర్లో ఓ మేలిమి ముత్యంలా నిలిచిపోయిన సినిమా 'ఆపద్బాంధవుడు'.

