Chiranjeevi Birthday Special: 'అన్నా-తమ్ముళ్ల ఈ అనుబంధమూ.. ఇలలో అందరికీ అది ఆదర్శమూ' అని చిరంజీవి 'అన్నయ్య' సినిమాలోని ఓ పాటలో చరణం.
సినిమా నేపథ్యమూ అన్నా-తమ్ముళ్ల ప్రేమ వారిమధ్య ఉన్న అనుబంధంపైనే. అందుకే రామాయణంలోని సోదర ప్రేమను ఉదహరించి సినిమాకు రాశారు రచయిత. ఎవరి సినిమాకు ఈ టైటిల్ పెట్టాలో.. ఎవరికి ఈ టైటిల్ పెడితే సరైన న్యాయం జరుగుద్దో ఆయన సినిమాకే ఈ టైటిల్ పెట్టడం, కథ కుదరడం, సినిమా సూపర్ హిట్ కావడం జరిగాయి. చిరంజీవికి ఆయన అభిమానులకు ఈ సినిమా చాలా ప్రత్యేకం. కారణం..
అభిమానులను తమ్ముళ్లుగా భావించే చిరంజీవికి ఆయన్ను ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుచుకునే ఫ్యాన్స్ కి సరిగ్గా కనెక్ట్ అయిన సినిమా 'అన్నయ్య'. సినిమా రిలీజ్ 2000 జనవరి 7వ తేదీన. అప్పటికి చిరంజీవి తన మార్క్ మాస్ సినిమాలు చేయడం మానేశారు. సినిమాలో కథకు ప్రాధాన్యమిస్తూ, కథానుసారం తన పాత్ర ఎలివేట్ అయ్యే పాత్రల్లోనే నటించడం అప్పటికి నాలుగేళ్ల క్రితం 'హిట్లర్' నుంచి ప్రారంభించారు. ఈ జోనర్ లోనూ చిరంజీవి సూపర్ సక్సెస్ సాధించారు. కానీ, అసలైన చిరంజీవి మార్క్ మాస్ సినిమా మాత్రం ఫ్యాన్స్ మిస్సయ్యారు.
అప్పiడొచ్చిందే 'అన్నయ్య'. ఈ సినిమా మాస్, కామెడీ, సెంటిమెంట్ కలగలిపిన కథా ప్రాధాన్యం ఉన్న సినిమానే. కానీ, అసలైన చిరంజీవి మాస్, కామెడీ టైమింగ్ తోపాటు సెంటిమెంట్ ఈ సినిమాలో పుష్కలం. దీంతో అభిమానులకే కాదు, ప్రేక్షకులకీ సినిమా బాగా కనెక్టయిపోయింది. డ్యాన్స్, కామెడీ, మాస్ అప్పీల్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశారు చిరంజీవి. నిజానికి 'సయ్యారే సయ్యా..' పాట మొదటి వారం తర్వాత యాడ్ చేస్తామని మొదట అల్లు అరవింద్ ప్రకటించినా.. తొలిరోజే ఉంచేశారు. ఈపాట సినిమాకు హైలైట్. ముత్యాల సుబ్బయ్య డైరక్షన్, మణిశర్మ పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

