ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడాలనే సంకల్పంతో రూపొందించిన చిన్న ప్రయత్నమే సీడ్ గణేశ అని తెలిపారు. సహజసిద్ధమైన పదార్థాలతో పాటు విత్తనాలను ఉపయోగించి తయారు చేసిన ఈ గణేశ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చని చెప్పారు.
అనంతరం ఆ విత్తనాలకు కొద్దిపాటి నీరు, సంరక్షణ అందిస్తే అవి మొక్కలుగా పెరిగి ప్రకృతికి మేలు చేస్తాయని వివరించారు.
ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన చిరంజీవికి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను చిరంజీవి ప్రశంసించడమే కాకుండా, సీడ్ గణేశ ప్రచారానికి తన మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి ప్రోత్సాహకరమైన సందేశం మరింత మంది ప్రజలను పర్యావరణహితంగా వినాయక చవితిని జరుపుకునేలా ప్రేరేపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భగవంతుడి ఆశీస్సులతో పాటు భూమాత పట్ల మన బాధ్యతను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. "గణేశుడిని ఆరాధిద్దాం… ఒక మొక్కను పెంచుదాం… ప్రకృతిని కాపాడుదాం" అనే సందేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజ పదార్థాలతో తయారైన సీడ్ గణేశ విగ్రహాలను ఉపయోగించడం ద్వారా భక్తి భావంతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

