తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన గ్రామీణ కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ సరోజ్, సాత్విక జంపా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'వేట' సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ (SRD Studios), ఈటీవీ విన్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కోటిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలుగా ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొణిదెల నాగబాబు, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబు ముహూర్తపు సన్నివేశానికి స్క్రిప్ట్ అందించగా, కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
సినిమా గురించి మాట్లాడుతూ హీరో సందీప్ సరోజ్, 'కమిటీ కుర్రోళ్లు' తర్వాత మరో ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని తెలిపారు. 'వేట' అనే టైటిల్ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ, తమ కథకు ఇది పూర్తిగా సరిపోయే పేరు అని చెప్పారు. ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు అర్థం సినిమా విడుదలకు ముందున్న అప్‌డేట్స్‌తో ప్రేక్షకులకు అర్థమవుతుందని పేర్కొన్నారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ… దర్శకుడు అశోక్ కోటిపల్లి కథను ఫోన్‌లో చెప్పినప్పుడే తనకు ఎంతో నచ్చిందన్నారు. కథలోని పాత్రలు, భావోద్వేగాలు, కథనం తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. ఈ చిత్రంలో తాను గ్రామంలోని పెద్దరాయుడు తరహా పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించిన ఆయన, ఇది కొత్త తరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే చిత్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ, ఇది తన తొలి దర్శకత్వ చిత్రం అని తెలిపారు. కథ వినగానే కేఎస్ రవికుమార్ వెంటనే అంగీకరించడం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చిందన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ, ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదేనని చెప్పారు. 'కమిటీ కుర్రోళ్లు' తరహాలో గ్రామీణ నేపథ్యం ఉన్నప్పటికీ, 'వేట' పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందన్నారు. దర్శకుడు అశోక్ కోటిపల్లి చెప్పిన కథ వినగానే సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. సందీప్ సరోజ్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త లుక్‌తో, కమర్షియల్ హీరోగా, యాక్షన్ ప్రధానమైన పాత్రలో కనిపిస్తారని చెప్పారు.
హీరోయిన్ సాత్విక జంపా మాట్లాడుతూ, 'వేట' తన కెరీర్‌లో ఎంతో కీలకమైన చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిభావంతులైన బృందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు.
గ్రామీణ వాతావరణం, బలమైన భావోద్వేగాలు, యాక్షన్, కమర్షియల్ అంశాలను మేళవిస్తూ రూపొందుతున్న 'వేట'లో సందీప్ సరోజ్, సాత్విక జంపాతో పాటు కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఏ. విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, రాఘవేంద్ర తిరుణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు కమర్షియల్ టచ్ జోడిస్తూ రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.

