Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం.. అయిదు కీలక తీర్మానాలకు ఆమోదం

నసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన 'సేన ప్రస్థానం - దేశ సమైక్యత కోసం' సమావేశంలో ఐదు కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది.

దేశాభివృద్ధి, జాతీయ సమైక్యత, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం, యువత ఆకాంక్షలు వంటి అంశాలపై ఈ తీర్మానాలు దృష్టి సారించాయి.

'వికసిత్ భారత్: ఆకాంక్షల నుంచి విజయాల వైపు' అనే తొలి తీర్మానాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్ల పాలన దేశ ప్రజాస్వామ్య వికాసం, జాతీయ పునరుజ్జీవనంలో ఒక కీలక అధ్యాయమని జనసేన విశ్వసిస్తోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. దీనికి ఏపీ ఎంఎస్ఐడిసి ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మద్దతు తెలిపారు.

రెండో తీర్మానంగా 'నేషన్ ఫస్ట్' సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రతిపాదించిన ఈ తీర్మానంలో దేశ సమగ్రత, ఐక్యత, జాతీయ దృక్పథం, ప్రతి పౌరునికి సమాన న్యాయం పట్ల జనసేనకు అచంచల నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. కులం, మతం, భాష, ప్రాంతాలకు అతీతంగా భారతదేశ వైవిధ్యంలో ఏకత్వమే దేశ బలమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ తీర్మానాన్ని బలపరిచారు.

మూడో తీర్మానంగా 'సంక్షోభం నుంచి నమ్మకం వైపు: ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధి' అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రతిపాదించగా, తూర్పుకాపు వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వి మద్దతు తెలిపారు.

నాలుగో తీర్మానంగా 'జనసేన పార్టీ పుష్కర కాల ప్రస్థానం: త్యాగం, సేవ, ప్రజల నమ్మకం తాలూకు ప్రయాణం' అనే అంశాన్ని ప్రవేశపెట్టారు. తెలంగాణ నాయకురాలు పి.శిరీష ప్రతిపాదించిన ఈ తీర్మానంలో జనసేన 12 ఏళ్ల చారిత్రాత్మక ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కొనియాడారు. ఆయన దార్శనికత, త్యాగం, పట్టుదలే జనసేనను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. ఈ తీర్మానానికి ఏపీ సృజనాత్మక, జానపద కళల అకాడెమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య మద్దతు తెలిపారు.

యువత ఆకాంక్షలను జనసేన అర్థం చేసుకుంటుందని పేర్కొంటూ ఐదో తీర్మానాన్ని అహుడా ఛైర్మన్ టి.సి.వరుణ్ ప్రతిపాదించారు. పార్టీ యువ నాయకుడు, నటుడు తనీష్ దీనిని బలపరిచారు.

దేశ సమైక్యత, అభివృద్ధి, యువత భవిష్యత్, రాష్ట్ర పునర్నిర్మాణం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశంతో ఈ సమావేశం ముగిసింది. పార్టీ భావజాలం, భవిష్యత్ కార్యాచరణను ప్రతిబింబించే ఈ ఐదు తీర్మానాలు జనసేన రాజకీయ ప్రస్థానంలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin