ది ప్యారడైజ్ 2026లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా. శ్రీకాంత్ ఓదెల రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, కాయదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అదే సమయంలో మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరి రావు, విశిక, సత్యరాజ్, రాజా రవీంద్ర, తనికెళ్ల భరణి, ప్రియదర్శి, పి విజయ్ కుమార్, రామ్ జగన్, సత్య ప్రకాశ్, కృష్ణ తేజ, సాయి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
కథ:
1980ల నాటి సికింద్రాబాద్‌లోని కల్పిత ప్రాంతమైన "ప్యారడైజ్"పై శికంజా మాలిక్ (మోహన్ బాబు) కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. వారి అణచివేతలో సవారి తెగ జీవిస్తుంటుంది. ప్రభుత్వ ఆంక్షలు, మాలిక్ కుటుంబం దౌర్జన్యాల మధ్య కూడా సమ్మక్క (సోనాలి కులకర్ణి) తన ప్రజల హక్కులు, వారి గుర్తింపు కోసం నిరంతరం పోరాడుతూ ఉంటుంది.
చిన్నప్పటి నుంచే సమ్మక్క కుమారుడు జడల్ (నాని)కు తన తల్లిపై ఒకరకమైన ద్వేషం ఏర్పడుతుంది. ఆమె సిద్ధాంతాలు, ఆమె చేస్తున్న పోరాటాన్ని అతను అంగీకరించడు. అయితే కాలక్రమంలో జరిగిన కొన్ని పరిణామాలు జడల్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తన గతం, తల్లి ఆశయాలు, తన తెగ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మలుపు ఏమిటి? చివరికి తన తెగకు గుర్తింపు తీసుకురాగలిగాడా? అనేది తెరపై చూడాల్సిందే.
ఆన్ స్క్రీన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి?
ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేయడానికి ప్రయత్నించే నాని మరోసారి తన పరిమితులను దాటి నటించాడు. జడల్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి తన కెరీర్‌లో మరో భిన్నమైన నటనను కనబరిచాడు. తనకు అలవాటైన ఇమేజ్‌కు పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ సినిమాను తన భుజాలపై మోశాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టడమే కాకుండా పాటల్లో కూడా తన వంతు బెస్ట్ ఇచ్చాడు.
మోహన్ బాబు శికంజా మాలిక్ పాత్రలో తనదైన శైలిలో నటించారు. అయితే రచన బలహీనంగా ఉండటం వల్ల ప్రతినాయకుడిగా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఈ పాత్రకు మరింత స్క్రీన్ టైమ్, బలమైన క్యారెక్టర్ ఆర్క్ ఇచ్చి ఉంటే ఇంకాస్త బాగా నిలిచేది.
రాఘవ్ జుయాల్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. నటన బాగున్నప్పటికీ మోహన్ బాబు కుమారుడిగా ఆయన పాత్రను చాలా పరిమితంగా మాత్రమే ఉపయోగించారు.
సోనాలి కులకర్ణి సమ్మక్క పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఎమోషనల్ కనెక్ట్ రావాలంటే ఈ పాత్రలో తెలిసిన తెలుగు నటి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
సంపూర్ణేష్ బాబు బిర్యానీ పాత్రలో తనవంతు న్యాయం చేసినా కథపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.
ఈశ్వరి రావు, విశిక తమ కీలక పాత్రల్లో మంచి ముద్ర వేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ అద్భుతంగా నటించారు.
ప్రియదర్శి స్పెషల్ క్యామియోలో సర్‌ప్రైజ్ ఇస్తాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులకు ఈ పాత్ర బాగా నచ్చుతుంది.
సత్యరాజ్, రాజా రవీంద్ర, తనికెళ్ల భరణి, పి విజయ్ కుమార్, సత్య ప్రకాశ్, రామ్ జగన్, కృష్ణ తేజ, సాయి కిరణ్ తదితరులు తమకు వచ్చిన పరిమిత పాత్రల్లో బాగానే చేశారు.
ఆఫ్ స్క్రీన్ టాలెంట్ ఎలా ఉంది?
శ్రీకాంత్ ఓదెల రాసుకున్న కథలో కొత్తదనం పెద్దగా కనిపించదు. సవారి తెగ గుర్తింపు కోసం జరిగే పోరాటం, ప్యారడైజ్ ప్రపంచాన్ని నిర్మించిన విధానంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని తెరపై చెప్పిన తీరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.
స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు అతిపెద్ద బలహీనత. సన్నివేశాల మధ్య సరైన ప్రవాహం లేకుండా ముఖ్యమైన సీక్వెన్స్‌లను అధ్యాయాల్లా వరుసగా అమర్చినట్లు అనిపిస్తుంది. సవారి తెగ గుర్తింపు కోసం జరిగే పోరాటానికి ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేడు. తల్లి-కొడుకు భావోద్వేగం కొంతవరకు పనిచేసినా రెండో భాగంలో అది కూడా బలహీనపడుతుంది. విలన్ పాత్రల రూపకల్పన బలహీనంగా ఉండగా, హీరో-విలన్ ఎదురెదురయ్యే సన్నివేశాలు పూర్తిగా నిరాశపరుస్తాయి.
దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల ప్రజెంటేషన్‌లో మెప్పించినా కథను నడిపించిన తీరు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. మొదటి భాగంలో ప్రపంచాన్ని చక్కగా పరిచయం చేసి ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లినా, ఇంత భారీ స్థాయి కథను రెండో భాగంలో ఎలా నడిపించాలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా నాని లాంటి స్టార్‌తో పెద్ద విజయం సాధించే అవకాశాన్ని ఆయన పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు.
డైలాగ్స్ చాలా బాగా రాశారు. తెలంగాణ యాసను సహజంగా ఉపయోగించడంతో పాటు కొన్ని సంభాషణలు థియేటర్లలో విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి.
అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు బాగున్నాయి. "ఆయా షేర్", "యేషనాగుల" ఇప్పటికే బ్లాక్‌బస్టర్ పాటలుగా నిలిచాయి. "అంజానా అంజాని" కూడా మెల్లగా ఆకట్టుకునే మెలోడీ. అయితే నేపథ్య సంగీతం మాత్రం ఆయన స్థాయికి తగ్గట్టు లేదు. కొన్ని కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తిగా నిరాశపరుస్తుంది.
చాయాగ్రాహకుడు సాయి పనితనం అసాధారణంగా ఉంది. ప్యారడైజ్ ప్రపంచాన్ని తన కెమెరా ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాడు. కలర్ టోన్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. యాక్షన్ సన్నివేశాలు, పాటలను ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించాడు.
నవీన్ నూలి ఎడిటింగ్ మాత్రం చాలా బలహీనంగా ఉంది. అనేక చోట్ల ఆకస్మిక కట్స్, సరైన సీన్ ట్రాన్సిషన్స్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
కాస్ట్యూమ్ డిజైనర్ అజయ్ కుమార్ జె పనితనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ప్రతి పాత్రకు తగిన లుక్, కాస్ట్యూమ్స్ అద్భుతంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా నాని స్టైలింగ్ చాలా స్టైలిష్‌గా ఉంది.
అవినాష్ కొల్లా, ఆయన టీమ్ రూపొందించిన ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. సెట్లు కథకు అవసరమైన భారీ స్థాయిని తీసుకొచ్చాయి.
బృందా, సుధన్, ఆట సందీప్ కొరియోగ్రఫీతో పాటు రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, మైబం నబకాంత, సింహాద్రి సింగూరు రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కాయి.
ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
ఏం బాగుంది?
ఏం బాగోలేదు?
తీర్పు:
ది ప్యారడైజ్ "సెకండ్ హాఫ్ సిండ్రోమ్"కు బలైన ఓ సాధారణ యాక్షన్ డ్రామా. మంచి సెటప్, నాని అద్భుతమైన నటన, మాస్ ఇంటర్వెల్ బ్లాక్‌తో మొదటి భాగం ఆకట్టుకున్నప్పటికీ, రెండో భాగంలో ఊహించదగ్గ కథనం, బలహీనమైన రచన, అతిగా సాగిన యాక్షన్ సన్నివేశాల కారణంగా సినిమా పూర్తిగా పట్టుతప్పుతుంది. మొత్తంగా చూస్తే ఇటీవల కాలంలో నాని చేసిన చిత్రాల్లో ఇది అత్యంత బలహీనమైన సినిమాగా చెప్పొచ్చు. ఇకపై ఇలాంటి మాస్ కథలను ఎంపిక చేసుకునే విషయంలో నాని మరోసారి ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది!!
TeluguBulletin.Com Rating: 2.25/5

