'నేను ఆ పార్టీ గురించి మాట్లాదలచుకోలేదు. ఎందుకంటే, అది చచ్చిపోయిన పార్టీ. ఆ పార్టీ పేరు తెలుసు కదా.. వైసీపీ.!' అంటూ జన సేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు, సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి, ఇది చాలా బోల్డ్ అండ్ వైల్డ్ స్టేట్మెంట్.!
నిజానికి, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అయినా, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అయినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే అంతలా ఆలోచిస్తే, ఎమ్మెల్సీ నాగబాబు అంత సింపుల్‌గా ఎలా 'చచ్చిపోయిన పార్టీ వైసీపీ' అనేసినట్టు.?
స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల తన ఉనికిని చాటుకుంది. కొన్ని చోట్ల పూర్తిగా చతికిలపడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. స్థానిక ఎన్నికలన్నాక అధికారంలో వున్న పార్టీలకే ఫలితాలు అనుకూలంగా వుంటాయి.
అయితే, ఇక్కడ నాగబాబు చేసిన వ్యాఖ్యల వెనుక బలమైన కారణం లేకపోలేదు.! వైసీపీ చచ్చిపోయిన పార్టీ అనడం సరికాదేమోగానీ, చావు అంచుల దాకా వెళ్ళిన పార్టీ.. అని చెప్పొచ్చు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్, 'చిన్న పిల్లాడిలా' మారాం చేస్తున్నారు.
మరోపక్క, అసలంటూ ఏపీలో లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటి స్థానిక ఎన్నికల్లో చీరాలలో తన ఉనికిని చాటుకుంది. అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి వచ్చి, తనకు మాత్రమే ట్రేడ్ మార్క్ వున్న చిత్ర విచిత్రమైన ప్రెస్ మీట్స్ పెడుతుంటారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
తమ అధినేత పెట్టే ప్రెస్ మీట్ల సారాంశం తమకే అర్థం కావడం లేదని వైసీపీ నాయకులే బిత్తర మొహాలు వేస్తున్న పరిస్థితి. అసలంటూ రాష్ట్రంలో రాజకీయపరమైన అంశాలే లేవన్నట్టుగా, వ్యక్తిగత విమర్శల తీవ్రత పెంచింది వైసీపీ ఈ మధ్యన.
చెప్పుకుంటూ పోతే, ఇలా చాలా అంశాల్లో వైసీపీ అసలు రాజకీయ పార్టీలానే వ్యవహరించడం లేదు. దాంతో, 'వైసీపీ చచ్చిపోయింది' అనే మాట నిజమేనంటూ వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న కొందరు సీనియర్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా వాపోతున్నారు.
బొత్స సత్యనారాయణ లాంటోళ్ళు, వెంటిలేటర్ మీదున్న వైసీపీని బతికించేందుకు చివరాఖరి ప్రయత్నాలు కూడా స్థానిక ఎన్నికల్లో చేసి, చివరికి చేతులెత్తేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది కూడా ఇదే పరిస్థితి. పులివెందులలోనే వైసీపీ ఖేల్ ఖతం అయ్యాక.. వైసీపీని 'డెడ్ పార్టీ' అని నాగబాబు అభివర్ణించడంలో వింతేముంది.?

