Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ ఖజానాకు కాసుల వర్షం.. జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటును దాటిన ఆంధ్రప్రదేశ్!

ఏపీ ఖజానాకు కాసుల వర్షం.. జీఎస్టీ వసూళ్లలో జాతీయ సగటును దాటిన ఆంధ్రప్రదేశ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు ఆదాయ ప్రవాహం మరింత బలపడుతోంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడంతో పాటు పన్నుల వసూళ్లలో పారదర్శకత పెరగడం వల్ల 2026 మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైంది.

గత ఏడాదితో పోలిస్తే మొత్తం పన్నుల వసూళ్లు 19 శాతం పెరిగి రూ.4,950 కోట్లకు చేరుకున్నాయి. 2025 మే నెలలో రాష్ట్రానికి రూ.4,165 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అదనంగా రూ.737 కోట్ల మేర ఆదాయం సమకూరింది.

వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ. విడుదల చేసిన వివరాల ప్రకారం, జీఎస్టీ వసూళ్లు 16 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి రూ.2,629 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే ఐజీఎస్టీ సెటిల్మెంట్ ద్వారా రాష్ట్రానికి రూ.1,758.58 కోట్లు లభించాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 15.36 శాతం అధికం.

పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. ఏకంగా 31.79 శాతం వృద్ధితో రూ.1,768.82 కోట్లకు చేరుకున్నాయి. ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో రూ.48.92 కోట్లు, మద్యం వ్యాట్ ద్వారా రూ.89 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి.

జీఎస్టీ వసూళ్ల పరంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటును అధిగమించడం విశేషంగా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో 17 శాతం వృద్ధితో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, 16 శాతం వృద్ధితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. కేరళ 15 శాతం, తెలంగాణ 14 శాతం, తమిళనాడు 12 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పెట్రోలియం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఎలక్ట్రికల్ మెషినరీ, బులియన్, జ్యువెలరీ రంగాల్లో లావాదేవీలు పెరగడం ఈ రికార్డు స్థాయి వసూళ్లకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్వాయిస్‌లను అరికట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థలతో పాటు వివిధ శాఖల డేటాను అనుసంధానం చేయడం ద్వారా పన్నుల లీకేజీలను తగ్గించగలిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి పన్నుల వసూళ్లను ఇంకా పెంచే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin