బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రాబోయే గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేయగా, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, మన్యం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు, కొండ ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే వరద నీటి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో కూడా రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం ఉండొచ్చని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో సోమవారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, ముషీరాబాద్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలిచింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖలు, HYDRAA, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజలు వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

