Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి రూ.7,707 కోట్ల వరం.. వికసిత్ భారత్ దిశగా మరో కీలక అడుగు

ఏపీకి రూ.7,707 కోట్ల వరం.. వికసిత్ భారత్ దిశగా మరో కీలక అడుగు

వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక మైలురాయిని చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లిలో నుంచి వికసిత్ భారత్ గ్రామీణ (VB-G RAM G) కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరై జాతీయ ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం విశేషమని పేర్కొంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా, ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించేందుకు అంగీకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు, గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రం చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగానే ఈ అవకాశం లభించిందని అభిప్రాయపడింది.

వికసిత్ భారత్ గ్రామీణ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707 కోట్ల నిధులు మంజూరు చేయడం రాష్ట్ర గ్రామీణాభివృద్ధికి కీలకమైన ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంది. అదనంగా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY-IV) కింద రూ.422 కోట్లతో 146 రహదారి పనులు, మొత్తం 347 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, 19 వంతెనల నిర్మాణానికి ఆమోదం లభించినట్లు వెల్లడించింది.

ఈ నిధులు కేవలం రహదారులు, వంతెనల నిర్మాణానికే పరిమితం కావని, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, రైతుల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరిగి, స్థానిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రామీణాభివృద్ధిపై చూపుతున్న ప్రత్యేక దృష్టి దేశవ్యాప్తంగా అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందని ప్రభుత్వం పేర్కొంది. స్వయం సమృద్ధి గ్రామాలే వికసిత్ భారత్‌కు పునాదిగా ఉండాలన్న ఆయన దూరదృష్టికి ఈ కార్యక్రమాలు నిదర్శనమని అభిప్రాయపడింది.

వికసిత్ భారత్ గ్రామీణ కార్యక్రమంలో దేశంలోనే అత్యధిక కేటాయింపులు పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలవడం గౌరవంతో పాటు బాధ్యత కూడా అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పూర్తి పారదర్శకతతో పనులు చేపడతామని స్పష్టం చేసింది. ప్రతి రహదారి, ప్రతి వంతెన నాణ్యతతో నిర్మించి, ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. గ్రామాల అభివృద్ధి, ప్రజల సాధికారత, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin