Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గల్లంతైన మత్స్యకారులపై పవన్ కళ్యాణ్ ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

గల్లంతైన మత్స్యకారులపై పవన్ కళ్యాణ్ ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల క్షేమంపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు.

ఈ నెల 3వ తేదీన ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన బోటు ఆగస్టు 13వ తేదీన తిరిగి చేరుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు దాని ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు.

గల్లంతైన బోటు కోసం మెరైన్ పోలీసు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖలతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు.

మత్స్యకారుల ప్రాణాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin