Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదావరి పుష్కరాలకు మరో రూ.100 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

గోదావరి పుష్కరాలకు మరో రూ.100 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

TeluguBulletin.com 3 weeks ago

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు' కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా కేటాయించిన రూ.100 కోట్లతో కలిపి మొత్తం రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

కొత్తగా విడుదల చేసిన నిధుల్లో రూ.90 కోట్లను పంచాయతీరాజ్ శాఖ, రూ.10 కోట్లను గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) శాఖ ద్వారా వినియోగించనున్నారు. ఈ నిధులతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 111 అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వీటి ద్వారా సుమారు 141 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారుల నిర్మాణం జరగనుంది.

రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం, రంపచోడవరం, ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో గ్రామాల నుంచి పుష్కర ఘాట్లకు వెళ్లే రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చోట గ్రామాల అంతర్గత రహదారులను కూడా మెరుగుపరచనున్నారు. గోదావరి పుష్కరాలను కేవలం రాజమహేంద్రవరం వంటి ప్రధాన కేంద్రాలకే పరిమితం చేయకుండా, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ప్రతి గ్రామంలో భక్తులు పుష్కర స్నానాలు, పూజలు, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించుకునేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

అదే సమయంలో ప్రతి పుష్కర ఘాట్‌లో రక్షిత తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం రూ.10 కోట్లను కేటాయించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని మునికూడలిని రూ.7 కోట్ల వ్యయంతో 'మోడల్ పుష్కర పంచాయతీ'గా అభివృద్ధి చేస్తున్నారు. సప్త ఋషి ఘాట్ వద్ద సీసీ రహదారులు, టవర్ లైట్లు, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ద్వారా ఇప్పటికే కేటాయించిన రూ.100 కోట్లను పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. ఈ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలతో గోదావరి పుష్కరాలను పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా, భక్తులకు మరింత అనుకూలంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin