Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుచ్చిమి ఏనుగుల కేంద్రంలో నాగబాబు.. అక్కడ ఏం చేశారు?

గుచ్చిమి ఏనుగుల కేంద్రంలో నాగబాబు.. అక్కడ ఏం చేశారు?

ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగబాబు ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణ, అటవీ అభివృద్ధి, మానవ-వన్యప్రాణి ఘర్షణల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పర్యటనలో భాగంగా గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్‌లో రావి, వేప మొక్కలను నాటిన నాగబాబు, అటవీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రతి ప్రదేశంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పచ్చదనాన్ని పెంచడంతో పాటు అటవీ పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

అనంతరం ఏనుగుల సంరక్షణ కేంద్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన నాగబాబు, అడవి ఏనుగుల కదలికలను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో ట్రాకర్లను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించడంలో ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు ఆయనకు వివరించారు.

మానవులు-వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తగ్గించే దిశగా అటవీ శాఖ అమలు చేస్తున్న ముందస్తు చర్యలను మ్యాప్‌ల సహాయంతో అధికారులు వివరించగా, ప్రజల భద్రతతో పాటు ఏనుగుల సంరక్షణకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని నాగబాబు అభినందించారు.

ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రంలోని 'జయంత్', 'అభిమన్యు' అనే రెండు కుంకీ ఏనుగులను నాగబాబు సందర్శించారు. వాటి ఆరోగ్యం, సంరక్షణ, ఆహారపు అలవాట్లపై మావటీలు, పశువైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాగి, స్వీట్ కార్న్, చెరకు, బెల్లం వంటి ఆహారాన్ని స్వయంగా కుంకీ ఏనుగులకు అందించారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సలహాదారు పి. మల్లికార్జున రావు, ఏపీసీసీఎఫ్ రాహుల్ పాండే, సీసీఎఫ్ బి.ఎన్.ఎన్. మూర్తి, విశాఖపట్నం సర్కిల్ సీసీఎఫ్ ఐ.కె.వి. రాజు, పార్వతీపురం మన్యం డీఎఫ్‌వో ఎస్. వెంకటేష్, విజయనగరం డీఎఫ్‌వో సోమసుందరం తదితర అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin