Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇళయరాజా - మణిరత్నం కలిస్తే. సినిమా కాదు, ఒక దృశ్య కావ్యం పుడుతుంది

ఇళయరాజా - మణిరత్నం కలిస్తే. సినిమా కాదు, ఒక దృశ్య కావ్యం పుడుతుంది

జూన్ 2… ఇద్దరి పుట్టినరోజు, ఒకే సంగీత పండుగ:

భారతీయ సినీ చరిత్రలో దర్శకుడు - సంగీత దర్శకుడు కాంబినేషన్లు ఎన్నో వచ్చాయి. కొన్ని హిట్లు ఇచ్చాయి.

కొన్ని రికార్డులు సృష్టించాయి. కానీ ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన కాంబినేషన్లు మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన కలయికల్లో ఇళయరాజా - మణిరత్నం జోడీ ఒకటి కాదు, ఒక యుగం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ ఇద్దరూ జూన్ 2నే జన్మించారు. ఒకరు సంగీతాన్ని కవిత్వంలా మలిచిన మహర్షి. మరొకరు సినిమాను చిత్రకావ్యంగా మార్చిన దర్శకుడు. ఈ ఇద్దరూ కలిసి పనిచేసిన ప్రతిసారీ తెరపై కేవలం సినిమా మాత్రమే రాలేదు. సంగీతం, భావోద్వేగం, దృశ్య సౌందర్యం, మౌనం, ప్రేమ, బాధ… అన్నీ కలిసిన ఒక అపూర్వ అనుభూతి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

1983లో పల్లవి అనుపల్లవి నుంచి 1991లో దళపతి వరకు సాగిన ఈ ప్రయాణం భారతీయ సినీ సంగీత చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోయింది. ఈ కాలంలో మణిరత్నం తీసిన ప్రతి ముఖ్య చిత్రానికి ఇళయరాజానే సంగీతం అందించారు. ఆ తర్వాత రోజాతో ఏ.ఆర్. రెహమాన్ యుగం మొదలైనా, మణిరత్నం-ఇళయరాజా కలయికకు ఉన్న ప్రత్యేక స్థానం మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరలేదు.

మౌనరాగం - మౌనానికి సంగీతం దొరికిన రోజు:

1986లో వచ్చిన మౌనరాగం కేవలం ప్రేమకథ కాదు. పెళ్లి, ప్రేమ, మనసులోని సంఘర్షణల గురించి అత్యంత అందంగా చెప్పిన చిత్రం. రేవతి, మోహన్, కార్తీక్‌ల నటనకు ఇళయరాజా సంగీతం ఆత్మగా నిలిచింది. తెలుగు ప్రేక్షకులను మైమరపించిన "చెలి రావా", "మల్లెపూల చల్లగాలి", "ఓహో మేఘమొచ్చెనే", "తడి తడి తలపు" వంటి పాటలు ప్రేమలోని మాధుర్యాన్ని, మనసులోని మౌనాన్ని అద్భుతంగా పలికించాయి. ఈ సినిమాలో పాటలు వినిపించవు… మనసులో తేలిపోతాయి. ప్రేమలోని నిశ్శబ్దానికే స్వరరూపం ఇచ్చిన సంగీత కావ్యం ఇది.

నాయకుడు - గ్యాంగ్‌స్టర్ కథలో ఆత్మను పలికించిన స్వరాలు:

1987లో వచ్చిన నాయకుడు భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కమల్ హాసన్ నటన ఎంత గొప్పదో, ఇళయరాజా సంగీతం అంత గొప్పది. ఈ చిత్రంలో పాటల కంటే నేపథ్య సంగీతమే ప్రేక్షకులను ఎక్కువగా కట్టిపడేసింది. వేలునాయకర్ జీవితంలోని ప్రతి మలుపునూ, ప్రతి బాధనూ, ప్రతి విజయాన్నీ ఇళయరాజా స్వరాలతో చిత్రించారు. ఒక గ్యాంగ్‌స్టర్ కథను కూడా కవిత్వంలా అనిపించేలా చేసిన అరుదైన సంగీత అనుభవం నాయకుడు.

ఘర్షణ - యూత్‌కు కొత్త సంగీత భాష నేర్పిన చిత్రం:

1988లో వచ్చిన ఘర్షణ అప్పటి యువతను ఉర్రూతలూగించింది. ఆధునిక సంగీత ధ్వనులు, కొత్త తరహా ఆర్కెస్ట్రేషన్, వేగవంతమైన బీట్‌లతో ఇళయరాజా యువతకు కొత్త సంగీత ప్రపంచాన్ని పరిచయం చేశారు. "రాజా.. రాజాధి రాజాధి రాజా.." "నిన్నుకోరి వర్ణం వర్ణం", "ఒక బృందావనం సోయగం", "రోజాలో లేత వన్నెలే ", "కురిసేను వీరిజల్లులే " వంటి పాటలు ఇప్పటికీ మెలోడీ ప్రియుల మనసుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఘర్షణ పాటలు వింటే యవ్వనమే సంగీతంగా మారి మన ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది.

గీతాంజలి - ప్రేమకు, మరణానికి మధ్య పుట్టిన అమర గీతం:

1989లో వచ్చిన గీతాంజలి తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి. నాగార్జున, గిరిజ నటన ఎంత అందంగా ఉంటుందో, ఇళయరాజా సంగీతం అంతకంటే అందంగా ఉంటుంది. "ఓ ప్రియా ప్రియా", "ఓ పాపా లాలి", "ఆమని పాడవే హాయిగా", "జల్లంత కవ్వింత", "నందికొండ వాగుల్లోనా" "ఓం నమః " వంటి పాటలు తరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ప్రేమకు రోజులు తక్కువగా ఉన్నా… ప్రేమ మాత్రం అనంతమని చెప్పిన సంగీత కావ్యం ఇది.చాలామంది అభిమానుల దృష్టిలో ఇది ఇళయరాజా - మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన అత్యంత మధురమైన ఆల్బమ్.

అంజలి - కన్నీటికి కూడా స్వరం ఉంటుందని చెప్పిన చిత్రం:

1990లో వచ్చిన అంజలి ఒక కుటుంబం, ఒక చిన్నారి, ఒక బాధ చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా చూసినవాళ్లు ఏడవకుండా ఉండలేరు. ఆ కన్నీళ్ల వెనుక ప్రధాన కారణం ఇళయరాజా సంగీతమే. "అంజలి అంజలి", "వేగం వేగం యోగం", "మేడపైన చూడమంట" వంటి పాటలు పిల్లల అమాయకత్వాన్ని, కుటుంబ బంధాలను, మానవీయ భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించాయి. ప్రతి పాట హృదయాన్ని తాకుతుంది. ప్రతి స్వరం మనసును కదిలిస్తుంది.

దళపతి - మహాభారతానికి ఆధునిక సంగీత రూపం:

1991లో వచ్చిన దళపతి ఈ జంట కలిసి చేసిన చివరి చిత్రం. రజనీకాంత్, మమ్ముట్టి నటనకు ఇళయరాజా సంగీతం అద్భుతంగా తోడైంది.
"సుందరి నువ్వే", "యమునా తటిలో", "సింగారాల పైరుల్లోనా", "చిలకమ్మా చిటికెయ్యంగా" వంటి పాటలు నేటికీ సంగీతాభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా "సుందరి నువ్వే" పాటలో వినిపించే సంగీత నిర్మాణం, ఆర్కెస్ట్రేషన్ ప్రపంచ స్థాయి కూర్పులకు ఏమాత్రం తీసిపోదు. స్నేహం, త్యాగం, ప్రేమ, విధి… అన్నింటినీ ఒకే సంగీత ప్రవాహంగా మార్చిన చిత్రం దళపతి.

ఇంకా మరిచిపోలేని తొలి అడుగులు:

పల్లవి అనుపల్లవి, ఉనారు, పగల్ నిలవు, ఇదయ కోవిల్ వంటి చిత్రాలు వాణిజ్యపరంగా అంత పెద్ద విజయాలు కాకపోయినా సంగీతపరంగా మాత్రం అమూల్యమైన సంపదను అందించాయి. మణిరత్నం అనే దర్శకుడి దృశ్య భాషను, ఇళయరాజా అనే సంగీత మేధావి స్వరాలతో ముడిపెట్టిన తొలి అడుగులు అవే.

అయితే ఈ ప్రయాణంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది:

గీతాంజలి మాత్రమే మణిరత్నం నేరుగా తెరకెక్కించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా. మౌనరాగం , నాయకుడు, ఘర్షణ, అంజలి, దళపతి వంటి మిగతా చిత్రాలన్నీ తమిళ్ నుంచి తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేయబడ్డవే. కానీ ఆశ్చర్యకరంగా, ఆ సినిమాలు స్ట్రెయిట్ తెలుగు చిత్రాల కంటే ఎక్కువ ఆదరణ పొందాయి. కారణం ఒక్కటే… మణిరత్నం దృశ్యాలకు ఇళయరాజా స్వరాలు తోడవడం. ఆనాటి యువతలో ఈ ఇద్దరి కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. కొత్త మణిరత్నం సినిమా వస్తుందంటే అందులో ఇళయరాజా సంగీతం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూసేవారు. వారి కాంబినేషన్‌లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్లప్పగించి ఎదురుచూసిన రోజులు అవి. భాషను దాటి, ప్రాంతాలను దాటి, సంగీతంతో ప్రేక్షకులను ఒకే భావోద్వేగంలో ముంచెత్తిన అరుదైన జోడీ ఇది.

వారి సంగీతం ఎందుకు ప్రత్యేకం?

ఇళయరాజా పాటలు కేవలం వినిపించవు… కనిపిస్తాయి. మణిరత్నం దృశ్యాలు కేవలం కనిపించవు… వినిపిస్తాయి. అందుకే ఈ ఇద్దరూ కలిస్తే ప్రతి పాట ఒక చిత్రంలా, ప్రతి చిత్రం ఒక గీతంలా అనిపిస్తుంది.

మౌనరాగం లో ప్రేమను పాడారు. నాయకుడులో జీవితాన్ని పాడారు. ఘర్షణలో యవ్వనాన్ని పాడారు. గీతాంజలిలో మరణాన్ని కూడా అందంగా పాడారు. అంజలిలో కన్నీళ్లకు స్వరం ఇచ్చారు. దళపతిలో స్నేహానికి, త్యాగానికి సంగీతం అందించారు.

కొన్ని కాంబినేషన్లు హిట్లు ఇస్తాయి. కొన్ని చరిత్ర సృష్టిస్తాయి. కానీ ఇళయరాజా - మణిరత్నం కాంబినేషన్ మాత్రం కాలాన్ని దాటి ప్రయాణిస్తుంది. వారి సినిమాలు చూసినప్పుడు మనం కథను మాత్రమే చూడం. సంగీతాన్ని మాత్రమే వినం. ఒక అందమైన దృశ్య కావ్యాన్ని ఆస్వాదిస్తాం.
జూన్ 2న పుట్టిన ఈ ఇద్దరు మహానుభావులు తెలుగు, తమిళ సినీ ప్రేమికులకు అందించిన ఆ సంగీత సంపద ఎప్పటికీ చిరస్మరణీయం. వారు కలిసి చేసిన సినిమాలు కేవలం సినిమాలు కావు… ప్రతి సినిమా ఒక గీతం, ప్రతి గీతం ఒక జ్ఞాపకం, ప్రతి జ్ఞాపకం ఒక అందమైన కావ్యం.
అందుకే ఇళయరాజా స్వరాలు వినిపించినప్పుడు మనసు తేలిపోతుంది. మణిరత్నం దృశ్యాలు కళ్లముందు మెదిలినప్పుడు హృదయం మురిసిపోతుంది. ఇద్దరూ కలిసి సృష్టించిన ఆ సంగీత ప్రపంచం కాలం మారినా, తరాలు మారినా, ఎప్పటికీ చెదరని ఒక మధుర జ్ఞాపకంగానే నిలిచిపోతుంది.

జూన్ 2 కేవలం ఇద్దరు మహానుభావుల పుట్టినరోజు మాత్రమే కాదు… భారతీయ సినీ సంగీతానికి ఒక పండుగ రోజు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin