వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా ఏడోసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడంపై జనసేన ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పత్సమట్ల ధర్మరాజు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని వారు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన వారు, ప్రతిపక్ష హోదా అంశాన్ని కారణంగా చూపుతూ సభకు దూరంగా ఉండడం సరైన విధానం కాదన్నారు.
పంతం నానాజీ మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వం కల్పించే అంశం కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పు మరియు శాసనసభలో పార్టీల బలాబలాల ఆధారంగా నిర్ణయించబడుతుందని తెలిపారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను జగన్ విస్మరిస్తున్నారని ఆరోపించారు.
ఉపాధ్యాయ నియామకాల విషయంలో కూడా ఆయన మాజీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని, కూటమి ప్రభుత్వం 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే దానిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలను రాజకీయ విమర్శలకు వేదిక చేయకూడదని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయకపోవడంపై కూడా జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని పంతం నానాజీ డిమాండ్ చేశారు. దేశం పట్ల గౌరవాన్ని ప్రతి ప్రజాప్రతినిధి ప్రదర్శించాలని అన్నారు.
ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై నిర్మాణాత్మక సూచనలు చేయాల్సింది పోయి విమర్శలకు మాత్రమే పరిమితం కావడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై విమర్శలు చేయడం తగదని, ఉపాధ్యాయ వృత్తిని చులకనగా మాట్లాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు వరుసగా గైర్హాజరు కావడం ద్వారా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని విమర్శించారు.

