Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీ మధ్యలో వెలుగులోకి రావడం చిన్న విషయం కాదు.
అంతటి సంచలన విజయం సాధించడంతో విజయ్ ఫ్యాన్స్ మొత్తం సంతోషంలో మునిగిపోయారు. ఈ ఉత్సాహంలో వారు విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' విడుదలకు డిమాండ్ చేస్తున్నారు. తెరపై ఆయన్ను చూసుకోవాలనేది వారి కోరిక. ఈక్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కు ఓ విజ్ఞప్తి చేస్తున్నారు.
సాధారణంగా విజయ్ టైటిల్ కార్డులో 'దళపతి విజయ్' అని వేస్తారు. కానీ.. ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం కాబోతున్నారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. ఈకారణంతో టైటిల్ కార్డు మార్చాలని నిర్మాణ సంస్థకు విజ్ఞప్తులు వెళ్తున్నాయి. 'దళపతి విజయ్' అని కాకుండా 'సీఎం దళపతి విజయ్' అని వేయాలని కోరుతూ నిర్మాణ సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న విజయ్ సినిమా విడుదలైతే మరింత ఉత్సాహంగా ఫ్యాన్స్ ఆదరిస్తారు.. కలెక్షన్ల మోత మోగడం ఖాయం.
అయితే.. 'జననాయగన్' మూవీ కొన్నాళ్లుగా సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. 2026 సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా సీబీఎఫ్ సీ రివైజింగ్ కమిటీ వద్ద ఉంది. సెన్సార్ అడ్డంకులతో విడుదల కాలేదు. ఎన్నికలు కూడా అయిపోయాయి కనుక సినిమా రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందని అంతా భావిస్తున్నారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసి అభ్యంతరం తెలపకపోతే.. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలోనే సినిమా విడుదలకావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.

