అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని స్పష్టం చేశారు.
కార్యకర్తలు ఐదేళ్ల పాటు ఎన్నో కష్టాలు పడి పార్టీని నిలబెట్టారని, వారి త్యాగాల వల్లే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు.
పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని, పనితీరు సరిగా లేకపోతే చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పార్టీ ముందుకు సాగుతోందని, పనిచేసిన కార్యకర్తలకు శాస్త్రీయంగా గుర్తింపు ఇచ్చి నామినేటెడ్ పదవులు కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని, ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయని చెప్పారు.
వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన లోకేష్, కూటమి ప్రభుత్వంలో చిచ్చుపెట్టేందుకు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. "గొడ్డలి పార్టీకి ఇంకా బుద్ధిరాలేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైనా వారి తీరు మారలేదు" అంటూ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు అలకలు, విభేదాలకు దూరంగా ఉండాలని, సమస్యలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలని సూచించారు.
2019 నుంచి 2024 మధ్యకాలంలో వేలాది మంది కార్యకర్తలపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని, అయినా వారు పసుపు జెండా దించకుండా పోరాడారని గుర్తుచేశారు. "కార్యకర్తే అధినేత" అన్న భావనతోనే పార్టీ నడుస్తోందని, సామాన్య కార్యకర్తలను కూడా పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా అభివృద్ధిపై కూడా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. "అనంతపురానికి కార్లే కాదు.. ఫైటర్ జెట్లు కూడా రాబోతున్నాయి" అని పేర్కొంటూ, ఈ ప్రాంతాన్ని దేశంలో ముందంజలో నిలబెట్టే బాధ్యత తీసుకుంటానన్నారు. కియా వంటి పరిశ్రమలతో పాటు మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయని సంకేతాలిచ్చారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రూ.4 వేల పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్లు, "తల్లికి వందనం", టీచర్ పోస్టుల భర్తీ, కానిస్టేబుల్ నియామకాలు వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు సరిగా చెప్పుకోకపోవడం వల్లే ఓటమి ఎదురైందని గుర్తుచేశారు.
ప్రధాని Narendra Modi ఇచ్చిన "నా దేశం - నా బాధ్యత" పిలుపును కూడా లోకేష్ ప్రస్తావించారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన, బంగారం ధరలు పెరుగుతున్నాయని, అందరూ పొదుపు పాటించాలని సూచించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
ప్రభుత్వ కొనసాగింపుతోనే అభివృద్ధి సాధ్యమని, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణ అని లోకేష్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సమావేశం అనంతరం పెద్ద సంఖ్యలో కార్యకర్తలను కలిసి ఫొటోలు దిగిన లోకేష్, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

