గుజరాతీ సినిమా 'లాలో: కృష్ణ సదా సహాయతే' దేశవ్యాప్తంగా సాధించిన అద్భుత విజయంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
కేవలం రూ.50 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.122 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, గుజరాతీ చిత్ర పరిశ్రమలో రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా నిలిచింది.
తాజా సమాచారం ప్రకారం, నిర్మాత మహావీర్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించే దిశగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం.
అయితే ఇది పూర్తి స్థాయి హీరో పాత్ర కాకుండా, కథలో కీలకమైన ప్రత్యేక అతిథి పాత్ర (కేమియో)గా ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాంప్రదాయ పురాణ రూపంలో కాకుండా, ఆధునిక శైలిలో శ్రీకృష్ణుడిని చూపించేలా కథను రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. అయితే రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు ఈ తెలుగు రీమేక్‌కు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 'జిగర్తాండ', 'పెట్టా', 'మహాన్' వంటి విభిన్న చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ కథను తెలుగు ప్రేక్షకులకు మరింత కొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దర్శకుడు, నటీనటుల ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
'లాలో: కృష్ణ సదా సహాయతే' కథ ఒక రిక్షా డ్రైవర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని సాగుతుంది. జీవితంలోని కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ, శ్రీకృష్ణుడి దర్శనాల ద్వారా అతని జీవితంలో చోటుచేసుకునే మార్పులు, ఆత్మపరిశీలన, విశ్వాసం, విముక్తి వంటి భావోద్వేగ అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఇదే భావోద్వేగాన్ని కొనసాగిస్తూ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా కొన్ని మార్పులతో రీమేక్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. రామ్ చరణ్, కార్తీక్ సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తుండటంతో ఈ రీమేక్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వస్తేనే పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.

