టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పెద్ది' గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు 'గేమ్ చేంజర్' తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు 'పెద్ది'పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకోవడం విశేషంగా మారింది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్‌కు వచ్చిన 'ఆచార్య', 'గేమ్ చేంజర్' ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా.. వాటి ప్రభావం ఆయన స్టార్‌డమ్‌పై పెద్దగా పడలేదనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. అందుకు ప్రధాన కారణంగా 'పెద్ది' చుట్టూ ఏర్పడిన బజ్‌ను సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ భారీ హైప్‌కు బుచ్చిబాబు కథనం, మేకింగ్ స్టైల్ ఒక కారణమైతే.. రామ్ చరణ్ చేసిన మేకోవర్, ఫిట్‌నెస్, పాత్ర కోసం తీసుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ మరో ప్రధాన ఆకర్షణగా మారాయి. అంతేకాదు, ఎమోషనల్ పాత్రల్లో రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది.
సోషల్ మీడియాలో రామ్ చరణ్‌ను ట్రోల్ చేసే ఇతర హీరోల అభిమానులు కూడా ఈసారి 'పెద్ది' విషయంలో పెద్దగా నెగిటివ్ ప్రచారం చేయకపోవడం గమనార్హం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సాధారణ ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఒక ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడినట్లు కనిపిస్తోంది.
ఇటీవల టాలీవుడ్‌లో కొనసాగుతున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యల మధ్య కూడా అందరూ ముక్త కంఠంతో 'పెద్ది' సినిమాకు ఎలాంటి ఆటంకాలు రావద్దని ఇండస్ట్రీ వర్గాలు కోరుకోవడం విశేషం. తెలుగు సినీ పరిశ్రమ మళ్లీ బలపడాలంటే పెద్ద సినిమాలు విజయవంతం కావాల్సిన అవసరం ఉందనే భావనతో చాలామంది ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 'పెద్ది' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. కుదేలైన సినీ పరిశ్రమకు మళ్లీ ఊపిరి పోసే పెద్ద ఆశగా మారిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక కావాల్సిందల్లా పెద్ది ఎంత బిజినెస్ చేస్తుంది అనే లెక్కలే.

