ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు దేశ సరిహద్దుల వరకు చేరిందని చెబుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లడఖ్‌లోని మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రముఖ యూట్యూబర్ సుధీర్ కుమార్ లడఖ్‌లోని టుర్‌టుక్ నుంచి నుబ్రా వైపు ప్రయాణిస్తుండగా ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో కొందరు స్థానిక చిన్నారులు ఆయనను ఆపి "సార్… షర్బత్ తాగండి" అంటూ ఆహ్వానించారు. దానికి ఎంత డబ్బులు ఇవ్వాలని అడగగా, మొహర్రం సందర్భంగా ఉచితంగా అందిస్తున్నామని, ఎలాంటి డబ్బులు అవసరం లేదని వారు చెప్పడం ఆయనను ఆకట్టుకుంది.
ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ మహిళ సుధీర్ కుమార్‌ను మీరు ఏ ఊరి వాళ్లు అని ప్రశ్నించారు. దానికి ఆయన "ఆంధ్రప్రదేశ్" అని సమాధానం ఇవ్వగానే, పక్కనే ఉన్న చిన్నారులు వెంటనే "అమరావతినా?" అని అడిగారు. దేశ సరిహద్దులోని మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్నారి నోటి నుంచి అమరావతి పేరు రావడంతో సుధీర్ కుమార్ ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆంధ్రప్రదేశ్ అనగానే అమరావతి గుర్తుకు రావడం గర్వకారణమని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమరావతి గుర్తింపు పెరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.

