తెలుగుదేశం పార్టీలో కిలారు రాజేష్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది మంత్రి నారా లోకేష్. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.. క్లాస్‌మేట్స్.. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న అనుబంధం.
అయితే ఆ స్నేహాన్ని ఎప్పుడూ పదవుల కోసం ఉపయోగించుకోకుండా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా కిలారు రాజేష్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. లోకేష్‌కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా, తెరవెనుక కీలక బాధ్యతలు నిర్వహించే వ్యక్తిగా ఆయనను టీడీపీ శ్రేణులు గుర్తిస్తాయి.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు కిలారు రాజేష్ స్టూడియో ఎన్ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల సమన్వయంలో తనదైన పాత్ర పోషించారు. తెర వెనుకే ఉంటూ కీలక నాయకులతో సమన్వయం చేస్తూ, పార్టీ నిర్వహణలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రచారానికి దూరంగా ఉండటం, అప్పగించిన పనిని నిశ్శబ్దంగా పూర్తి చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కిలారు రాజేష్ వెనక్కి తగ్గలేదు. నారా లోకేష్‌కు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. ఇదే సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుని వరుసగా 11 క్రిమినల్ కేసులు నమోదు చేసిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తుంటారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుతో పాటు, అసలు నిర్మించని అమరావతి రింగ్ రోడ్డు కేసులో కూడా ఆయన పేరును చేర్చారని చెబుతారు. హైదరాబాద్‌లో సీఐడీ అధికారులు వెంటాడడం, విచారణల పేరుతో ఒత్తిళ్లు తీసుకురావడం, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా పార్టీతోనే నిలిచారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
టీడీపీ వర్గాల కథనం ప్రకారం, అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం కేవలం రాజకీయ ప్రత్యర్థులను ఓడించడం మాత్రమే కాకుండా, చంద్రబాబు, లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వారిని కూడా టార్గెట్ చేయడమేనని ఆరోపిస్తున్నారు. నారా లోకేష్ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్న కిలారు రాజేష్‌ను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. రాజేష్‌ను బెదిరించి లోకేష్‌కు సంబంధించిన సమాచారం సేకరించాలని ప్రయత్నించారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు, రింగ్ రోడ్డు కేసులు నమోదు చేసినప్పటికీ, 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసులను కొట్టివేసింది. రాజధాని ప్రాంతానికి సంబంధించిన సమాచారం అప్పటికే బహిరంగంగా ఉందని, భూములు విక్రయించిన వారి నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు నమోదు చేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే రింగ్ రోడ్డు కేసు కూడా నిలబడలేదని తీర్పు వెలువడింది.
నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో కిలారు రాజేష్ పాత్రను టీడీపీ శ్రేణులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తాయి. ప్రతి రోజు పాదయాత్ర షెడ్యూల్ సిద్ధం చేయడం, స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం, ముందస్తు ఏర్పాట్లు, ఫీడ్‌బ్యాక్ సేకరణ వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. అర్ధరాత్రి వరకు పనిచేస్తూ పాదయాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని పార్టీ నాయకులు చెబుతుంటారు. 2023లో చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కూడా లోకేష్‌కు అండగా నిలిచి పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసిన వారిలో కిలారు రాజేష్ ఒకరని పేర్కొంటారు.
2024 ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా కిలారు రాజేష్ తన అనుభవాన్ని ఉపయోగించారు. యువగళం పాదయాత్ర ద్వారా సేకరించిన నియోజకవర్గాల సమాచారం, స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల పనితీరు, ప్రజాభిప్రాయాన్ని నివేదికల రూపంలో పార్టీ అధినాయకత్వానికి అందించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల వ్యూహరచనలో ఆయన అందించిన సమాచారం ఉపయోగపడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
లోకేష్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్నప్పటికీ, తన పరిధిని ఎప్పుడూ దాటలేదని టీడీపీ నేతలు చెబుతుంటారు. వ్యక్తిగత పరిచయాన్ని అధికారంగా మార్చుకునే ప్రయత్నం చేయకుండా, అప్పగించిన బాధ్యతలకే పరిమితమయ్యారని అంటున్నారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికార కేంద్రంగా మారడం వంటి ధోరణులకు దూరంగా ఉండి, సాధారణ కార్యకర్తలా పార్టీ కోసం పనిచేయడం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని చెబుతున్నారు.
ప్రస్తుతం కూడా మంత్రి నారా లోకేష్ కార్యక్రమాల సమన్వయంతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కిలారు రాజేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం 2026లో జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. పార్టీ కోసం నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు తప్పకుండా లభిస్తుందనే విషయానికి కిలారు రాజేష్ రాజకీయ ప్రయాణం ఉదాహరణగా నిలుస్తోందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
నేడు కిలారు రాజేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పార్టీ కోసం తెరవెనుక పనిచేసిన నాయకుడిగా, క్లిష్ట సమయంలోనూ వెనక్కి తగ్గని కార్యకర్తగా, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా కిలారు రాజేష్‌ను పలువురు అభివర్ణిస్తున్నారు.

