మంగళగిరి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం మంగళగిరి పట్టణంలోని నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో నిర్మించనున్న మోడరన్ రైతు బజార్‌కు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టుతో రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు ఒకే వేదికపై ఆధునిక మార్కెట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
శంకుస్థాపన కార్యక్రమానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, ప్రాజెక్టు నమూనాలను పరిశీలించిన ఆయన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మంగళగిరి ప్రజల అవసరాలు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మోడరన్ రైతు బజార్‌ను 5.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులతో రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ ఇంటిగ్రేటెడ్ రిటైల్-హోల్‌సేల్ మార్కెట్ రూపుదిద్దుకోనుంది. మొత్తం 71,925 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో పర్యావరణహితంగా, పరిశుభ్రంగా మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నారు.
రిటైల్ విభాగంలో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర అవసరాల కోసం 60 దుకాణాలను నిర్మించనున్నారు. హోల్‌సేల్ విభాగంలో 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, 23 కూరగాయల షాపులు అందుబాటులో ఉంటాయి. అలాగే కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాషింగ్ ఏరియా, పరిపాలనా విభాగం, మెయింటెనెన్స్ బ్లాక్, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. సరుకులు తీసుకొచ్చే వాహనాలతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ జీ. భీముడు, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

