Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంగళగిరిలో నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ సందడి.. డబ్ల్యూఏపీఎల్ ప్రారంభం

మంగళగిరిలో నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ సందడి.. డబ్ల్యూఏపీఎల్ ప్రారంభం

హిళల క్రికెట్‌కు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వేదికగా నిలవనున్న ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్‌కు మంగళగిరిలో ఘనంగా శ్రీకారం చుట్టారు.

ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకల్లో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి డబ్ల్యూఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించడంతో పాటు టోర్నీని అధికారికంగా ప్రారంభించారు.

మహిళా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారికి ఉమెన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు భారత మహిళల జట్టులో అవకాశాలు దక్కేలా చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ లీగ్‌ను నిర్వహిస్తోంది. స్టేడియానికి చేరుకున్న నారా బ్రాహ్మణికి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం మిథాలీ రాజ్‌తో కలిసి ఆమె టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, మహిళా క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు డబ్ల్యూఏపీఎల్ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి అవకాశాలు మరింత మంది యువ క్రీడాకారిణులను ప్రోత్సహిస్తాయని, భవిష్యత్‌లో వారు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా క్రీడాకారిణులకు అవకాశాలు కల్పించడంలో ముందడుగు వేసిన ఏసీఏ నిర్వాహకులను ఆమె అభినందించారు.

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఈ టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ అనే నాలుగు జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.

మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏడు రోజుల పాటు మొత్తం 13 టీ-20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రోజు రాయలసీమ జెన్ స్టార్స్-గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ నిర్వహించగా, అనంతరం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ అభిమానులను అలరించింది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణిని నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించగా, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin