Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆమధ్య తమిళనాడులోని పొలాచ్చిలో మొదటి షెడ్యూల్ జరుపుకుంది. ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతోపాటు ఓ పాట కూడా చిత్రీకరించింది చిత్ర యూనిట్. తదుపరి షెడ్యూల్ ఇటివలే హైదరాబాద్ లో ప్రారంభమైంది.
ఈ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవిని మునుపెన్నడూ చూడని సరికొత్త యాక్షన్ నేపథ్యంలో చూపించనున్నారు బాబీ. యాక్షన్ డైరక్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఇవి మేజర్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. రిస్కీ ఫైట్స్ ను చిరంజీవి స్వయంగా చేస్తున్నారని టీమ్ వెల్లడించింది. త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ విడుదల చేయనున్నట్టు కూడా తెలిపింది.
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనస్వర రాజన్ సినిమాలో చిరంజీవికి కుమార్తెగా నటిస్తున్నారు. తండ్రీ-కూతురు సెంటిమెంట్ తోపాటు మాఫియా బ్యాక్ డ్రాప్ తో సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. నటి నివేదా పేతురాజ్ తోపాటు పలువురు నటీనటులు సినిమాలో నటిస్తున్నారు. సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.

