మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రయాణం 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులను ఉద్దేశించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
1978 సెప్టెంబర్ 22న విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రంతో ప్రారంభమైన తన నట జీవితాన్ని గుర్తు చేసుకున్న ఆయన, ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు దక్కిన అతిపెద్ద సంపద అభిమానుల ప్రేమేనని చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన చిరంజీవి, ఈ 48 ఏళ్లలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించే అవకాశం దక్కిందని, ఎన్నో విజయాలను అందుకున్నానని తెలిపారు. అనేక అవార్డులు, గౌరవాలు తనను వరించినప్పటికీ, వాటన్నింటికంటే అభిమానులు తనపై కురిపించిన ప్రేమ, ఆదరణే ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో తనను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, తనలోని నటుడిని కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృంద సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకోవడం సాధ్యమయ్యేది కాదన్నారు.
అయితే తన జీవితంలో సాధించిన విజయాలన్నింటికంటే గొప్పది అభిమానుల ప్రేమేనని చిరంజీవి స్పష్టం చేశారు. "ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఇన్నేళ్లుగా చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.
"ఆరోజు 'చిరంజీవి' అనేది నేను పెట్టుకున్న పేరు. నేడు మీ ప్రేమతో అది నాకు శాశ్వతమైన గుర్తింపుగా మారింది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. తనపై చూపిస్తున్న అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఎప్పటికీ అదే ప్రేమను నిలబెట్టుకునేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
చిరంజీవి చేసిన ఈ పోస్ట్‌కు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, 48 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త… pic.twitter.com/5wBJnXl3MP
- Chiranjeevi Konidela (@KChiruTweets)

