Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడోసారి రాకేష్‌ నాని విజయం.. వర్కర్లకు కొత్త హామీ

మూడోసారి రాకేష్‌ నాని విజయం.. వర్కర్లకు కొత్త హామీ

TeluguBulletin.com 3 weeks ago

తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి టెక్నిషియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘన విజయం సాధించింది. శ్రీకృష్ణానగర్‌లోని టీవీ ఫెడరేషన్‌ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ నుంచి పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పదవులకు జరిగిన పోలింగ్‌లో శ్రామిక ప్యానల్‌కు చెందిన కొయ్యలమూడి రాకేష్‌ (నాని), పుట్టా విజయ్‌కుమార్‌లు సుమారు 95 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు.

ఈ విజయంతో కొయ్యలమూడి రాకేష్‌ (నాని) వరుసగా మూడోసారి తెలుగు టెలివిజన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన ఆయన, ఫెడరేషన్‌లోని 24 శాఖల్లో దాదాపు 7,000 మంది సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని రాకేష్‌ నాని పేర్కొన్నారు. ఫెడరేషన్‌కు చెందిన ఏ సభ్యుడు దురదృష్టవశాత్తు మరణించినా, వారి కుటుంబానికి గంటలోపే రూ.1 లక్షల అత్యవసర ఆర్థిక సహాయం అందించే విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. సభ్యుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఎన్నికలు టీవీ అడహక్‌ కమిటీ చైర్మన్‌ పి. మురళి, వైస్‌ చైర్మన్‌ బి. మోహన్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించగా, హైకోర్టు న్యాయవాది కె.వి.ఎల్‌. నరసింహారావు ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన ఇతర పదాధికారుల్లో కె. నరేందర్‌రెడ్డి వైస్‌ ప్రెసిడెంట్‌గా, రమేష్‌ మాస్టర్‌, ఎస్‌.కె. ఖుద్దూస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్లుగా, కె. ఈశ్వర్‌, ఎం.వి.వి. కృష్ణమూర్తి జాయింట్‌ సెక్రటరీలుగా ఎన్నికయ్యారు. బి. మహిపాల్‌, కె. మధు, పి. మురళీకృష్ణ, ఆర్‌. నాగరాజు ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎ. దేవి, డి. సందీప్‌ కుమార్‌, జి. సత్యనారాయణమూర్తి, జి. శంకర్‌, టి. సత్యనారాయణ (సత్యమాస్టర్‌)తో పాటు ఈసీ సభ్యులుగా ఏ. కరుణాకర్‌, బి. రాము, సి.హెచ్‌. కామేశ్వరరావు, కె. లోకేష్‌, పి. యామేష్‌ (చక్రి) ఎన్నికయ్యారు.

ఫెడరేషన్‌ ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌కు లభించిన ఈ భారీ మద్దతుతో సభ్యుల సంక్షేమ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని కొత్త కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin