మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం వెనక్కి తగ్గదని వ్యాఖ్యానించారు.
బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ, "మర్యాదగా మీరే ఖాళీ చేసి సామాన్లతో వెళ్లిపోండి. మీరు ఎంత ఏడ్చినా, మీడియాలో నన్ను ఎంత తిట్టినా ఇళ్ల కూల్చివేత మాత్రం ఖాయం" అని హెచ్చరించారు.
మూసీ నది ప్రక్షాళన అనేది కేవలం అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాకుండా నగర భవిష్యత్తుకు అవసరమైన చర్య అని సీఎం పేర్కొన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా, రాజకీయ విమర్శలు ఎదురైనా ప్రక్షాళన పనులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. "ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన చేస్తా.. అన్నీ తొలగిస్తా. ఒక రోజు ముందా, వెనుకా అంతే" అనే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఈ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తుండగా, మరోవైపు నగర అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో సీఎం తాజా వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.

