Nagarjuna Birthday Special: యువ సామ్రాట్.. కింగ్.. మన్మధుడు.. సౌత్ ఇండియన్ సుప్రిమో.. ఇన్ని పేర్లు కలిగిన హీరో.. తండ్రి సినీ లెగసీని అంతే ఘనంగా ముందుకు తీసుకెళ్తూ..
హిందీతోపాటు తమిళంలో కూడా క్రేజ్ తెచ్చుకున్న తెలుగు నటుడిగా.. ఇద్దరు కుమారులతో తమ సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ.. ప్రపంచ సినీ చరిత్రలో మరే కుటుంబానికీ నేటికీ సాధ్యంకాని తమ కుటుంబంలోనే మూడు తరాల హీరోలతో ముచ్చటైన ఫ్యామిలీ సినిమా అందించిన హీరోగా.. తెలుగు చిత్ర పరిశ్రమకు స్టూడియోతో సేవలు అందిస్తూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ లెజండరీ ఫ్యామిలీలా ఎదిగిన కుటుంబానికి మూలస్థంభంలా నిలిచి.. నేడు ఆ ఫ్యామిలీ లెగసీ అంటే ఠక్కున తానే గుర్తొచ్చేంతగా ఎదిగిన ఆ సూపర్ స్టారే.. 'అక్కినేని నాగార్జున'. నేడు ఆయన పుట్టినరోజు.
1986లో లెజండరీ అక్కినేని నాగేశ్వరరావు వంశాంకురంగా.. సినీ వారసుడిగా 'విక్రమ్' సినిమాతో తెరంగేట్రం చేసిన నాగార్జున కెరీర్ తొలినాళ్లలో అంత సాఫీగా సాగలేదు. 1987లో వచ్చిన 'కలెక్టర్ గారి అబ్బాయి' పర్వాలేదనిపించినా కెరీర్ టర్నింగ్ కు మరో రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. అప్పుడు వచ్చిందే 'గీతాంజలి'. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా నాగార్జునను తెలుగు సినిమాకు మరో ట్రంప్ కార్డ్ గా మార్చింది. అప్పటివరకూ హీరో అంటే ఇలానే ఉండాలనే సూత్రానికి భిన్నంగా నాగార్జున తీసుకొచ్చిన హెయిర్ స్టైల్, మేకోవర్ నాటి యువతను ఊపేసింది. 1989లో వచ్చిన 'శివ' నాగార్జున కెరీర్ ల్యాండ్ మార్క్ అనడంకంటే.. తెలుగు సినిమా ఫేస్ కార్డ్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే భారతీయ సినిమా మేకింగ్ నే మార్చేసింది 'శివ'.
నాగార్జున ప్రయోగాల హీరో అనేది వంద శాతం నిజం. ఆయన చేసిన ప్రయోగాలు మరెవరూ తెలుగులో చేయలేదు. దర్శకుడిగా ఏమాత్రం అనుభవంలేని రామ్ గోపాల్ వర్మ కథ విని కొత్తగా ఉందని తన సొంత నిర్ణయంతో అవకాశమిచ్చిందే 'శివ'. ఆ తర్వాత కొందరికి దర్శకులుగా తొలి అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. 1994లో వచ్చిన 'హలో బ్రదర్' నాగార్జునను స్టార్ చేసింది. అక్కడి నుంచి అక్కినేని లెగసీని కేక్ వాక్ లా నడిపించారు. ముందు తరం, నేటి తరంలో మరే హీరో చేయలేనంతగా భక్తి సినిమాలు చేశారు. అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్లో ఆయన నటన పాత్రలకే వన్నె తెచ్చింది. మాస్, క్లాస్, భక్తి, రొమాన్స్.. నాగార్జున చేయని జోనర్ లేదు. స్టార్ హీరో అయ్యుండీ.. 'ఊపిరి' సినిమా మొత్తం చక్రాల కుర్చీలోనే ఉండే పాత్ర చేయడం నాగార్జునకే సొంతం.
ఏక్షణాన 'మన్మధుడు' సినిమా చేశారో.. టాలీవుడ్ మన్మధుడిలా పేరు తెచ్చుకున్నారు. 67వ ఏట అడుగిడుతున్నా తన ఫిట్ నెస్ తో.. లుక్స్, స్టయిల్ తో గ్రీకువీరుడనే అనిపిస్తున్నారు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. 'అక్కినేని' లెగసీ తెలుగు సినిమాలో దేదీప్యమానంగా వెలుగుతోంది. 'మనం' సినిమాలో వీరందరినీ భాగంచేసి అసలైన సినీ ఫ్యామిలీ అనిపించారు. చివరి శ్వాస వరకూ సినిమానే ఊపిరిగా జీవించిన తండ్రికి 'మనం'తో మంచి గిఫ్ట్ ఇచ్చారు.. తండ్రి చివరి సినిమాగా ఘనమైన నివాళి ఇచ్చారు. ఇన్ని విశేషాలున్న నాగార్జున నిజంగానే సౌత్ ఇండియన్ సుప్రిమో. ప్రస్తుతం ఆయన 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న తమిళ డైరక్టర్ కు అవకాశం ఇచ్చారు. ఇదే నాగార్జున అంటే. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది 'తెలుగు బులెటిన్'.. హ్యాపీ బర్త్ డే కింగ్ నాగ్.

