Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. ముగ్గురి ఆచూకీపై మంత్రి లోకేష్ ఆరా

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. ముగ్గురి ఆచూకీపై మంత్రి లోకేష్ ఆరా

TeluguBulletin.com 3 weeks ago

నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల పరిస్థితిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. యాత్రికుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారు.

ఏపీ ఢిల్లీ భవన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి లోకేష్‌కు, వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల్లో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరో ముగ్గురి ఆచూకీ ఇంకా లభించలేదని తెలిపారు.

కుప్పం ప్రాంతానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్ సభ్యులు శశికుమార్, రాజ్యలక్ష్మిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా ఈషా ఫౌండేషన్‌కు చెందిన శశికుమార్‌ను చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ సమీపంలో గుర్తించినట్లు సమాచారం అందింది.

మిస్సింగ్‌గా ఉన్న ముగ్గురి ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. భారత రాయబార కార్యాలయం, చైనా మరియు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయాలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్‌తో పాటు ఈషా ఫౌండేషన్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించారు.

మరోవైపు, కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్టీజీఎస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పరిస్థితిని మానిటర్ చేస్తూ యాత్రికుల భద్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin