జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
మంగళగిరిలో నిర్వహించిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం 150 మందితో ప్రారంభమైన జనసేన పార్టీ నేడు 22 లక్షల మంది సభ్యులతో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు.
రాజకీయాల్లో సమూల మార్పు తీసుకురావాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశయంతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని చెప్పారు. పార్టీ ప్రారంభం నుంచి సాధక్‌లు, జనసైనికులు క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు. ప్రతి కార్యకర్త కష్టానికి జనసేనలో గౌరవం, గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.
2020లో 94 వేల సభ్యత్వాలతో ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం 21.50 లక్షలకు చేరుకుందని వివరించారు. కోవిడ్ సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తూనే సభ్యత్వాలను పెంచామని, 2023లో 5.5 లక్షలు, 2024లో 12 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. పదేళ్ల నిరంతర పోరాటం, గత ఎన్నికల్లో సాధించిన విజయంతో జనసేన పార్టీ ఒక రిజిస్టర్డ్ పార్టీ స్థాయి నుంచి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీగా ఎదిగిందన్నారు.
పార్టీ కోసం పనిచేస్తూ ఇప్పటివరకు 1,034 మంది జనసైనికులు, వీర మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని నాదెండ్ల మనోహర్ అన్నారు. వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలిచిందని, రూ.46.35 కోట్ల ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. మృతుల పిల్లల విద్య బాధ్యతను కూడా పార్టీ భుజాలపై వేసుకుందని తెలిపారు.
స్వార్థ రాజకీయాలకు జనసేన ఎప్పుడూ దూరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యల ఆధారంగానే పార్టీ పోరాటాలు సాగించిందని చెప్పారు. కౌలు రైతుల ఆర్థిక సాయం నుంచి రోడ్ల సమస్యల వరకు ప్రజల కోసం మాత్రమే ఉద్యమాలు చేశామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను చూసి ఆవేశపూరితంగా స్పందించి పార్టీకి నష్టం చేయవద్దని కార్యకర్తలకు సూచించారు.
జనసేనలో వర్గాలు, భిన్న నాయకత్వాలు లేవని, పార్టీకి ఒకే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తారని చెప్పారు. క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ గుర్తింపు ఇచ్చారని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
త్వరలో రానున్న మున్సిపల్, కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు మంచి అవకాశమని తెలిపారు. క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గతంలో వైసీపీ ఒత్తిడులు, అక్రమ కేసులు ఎదురైనా జనసైనికులు ధైర్యంగా పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారు. 175 నియోజకవర్గాల్లో జనసేనను మరింత బలోపేతం చేయాలంటే కొత్తవారిని పెద్దమనసుతో పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు.
ఎవరు కష్టపడ్డారో, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసని నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో తగిన స్థానం, పదవి లభిస్తాయని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని కార్యకర్తలకు సూచించారు.
జనసేన ఎప్పుడూ అవకాశవాద రాజకీయాలు చేయలేదని, విలువలతో కూడిన రాజకీయాలే పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చాయని చెప్పారు. అదే నిజాయితీ వల్లే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి పరామర్శించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిస్వార్థంగా చేస్తున్న రాజకీయ ప్రయాణానికి దేశ స్థాయిలో గౌరవం లభించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నేతలు, సాధక్‌లు పాల్గొన్నారు.

