జీ5లో ఇటీవల విడుదలైన ఒరిజినల్ వెబ్ సిరీస్ 'పంచనామా' ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్, సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
విడుదలైన వారం రోజుల్లోనే 25 మిలియన్ డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటడం ద్వారా ఈ సిరీస్‌కు లభిస్తున్న ఆదరణను మరోసారి నిరూపించింది.
దర్శకుడు మోహన్ శ్రీవత్స రూపొందించిన ఈ సిరీస్‌కు ఉదయభాను నిర్మాతగా, షోరన్నర్‌గా వ్యవహరించారు. మొత్తం ఆరు ఎపిసోడ్లతో వచ్చిన తొలి సీజన్ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
వరుసగా జరిగే మూడు హత్యలు, వాటి వెనుక ఉన్న మిస్టరీ, ఎలాంటి ఆధారాలు దొరకక ఇబ్బందులు పడే పోలీసుల దర్యాప్తు, చివరకు ఊహించని నిజం వెలుగులోకి రావడం వంటి అంశాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఏమి జరుగుతుందనే ఉత్కంఠను సృష్టించేలా కథనం సాగడం ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది.
ముఖ్యంగా తొలి సీజన్ క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ ముగిసినట్టే అనిపించినా, అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైందనే ఆసక్తిని కలిగిస్తూ రెండో సీజన్‌పై భారీ అంచనాలు పెంచేలా ముగించారు.
ఈ సిరీస్‌లో పోలీస్ అధికారి పాత్రలో భరత్ శ్రీనివాసన్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీరియస్, ఇన్వెస్టిగేటివ్ పాత్రలో ఆయన నటనకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మి, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా కూడా పంచనామా మంచి మార్కులు కొట్టేస్తోంది. నరేష్ కుమరన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సందీప్ కాంత్ సినిమాటోగ్రఫీ, మోహన్ శ్రీవత్స టేకింగ్ కలిసి ప్రతి సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాయి.
క్రైమ్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు పంచనామా మంచి ఎంపికగా నిలుస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే 25 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేయడం, ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారో స్పష్టంగా చూపిస్తోంది.

