Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

నసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మంగళగిరిలో జరిగిన జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ నేడు 21.05 లక్షల మంది సభ్యులతో భారీ ఉద్యమ శక్తిగా ఎదిగిందని తెలిపారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా జనసేన భావజాలాన్ని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

జనసేన పార్టీకి సంస్థాగత నిర్మాణం మరింత బలంగా ఉండాలని భావించి "లక్ష్యదళ్, నిర్వాహక్ దళ్, పరిపాలక్ దళ్" అనే విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల నుంచి పార్టీ విధానాలు రూపొందించే నాయకత్వం వరకు స్పష్టమైన బాధ్యతలు ఉండేలా వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వివాద పరిష్కార వ్యవస్థను తీసుకొస్తున్నామని చెప్పారు. జనసేన కార్యకర్తలు కేవలం అభిమానులుగా కాకుండా సమాజ సమస్యలపై స్పందించే నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

విశాఖ సభలో "నేనే మా ఊరికి పవన్ కళ్యాణ్" అని చెప్పే స్థాయికి యువతను తయారు చేశామని పేర్కొన్నారు. విజయనగరంలో ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న "మంగళవారం హుస్సేన్", ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు దారిలో వెళ్లకుండా ప్రజాస్వామ్య పోరాటాన్ని ఎంచుకున్న బాబురావు వంటి ఉదాహరణలు జనసేన భావజాల బలానికి నిదర్శనమని చెప్పారు.

తన ఆరోగ్య పరిస్థితిపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. కరోనా తర్వాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, సైనస్ సమస్యలు, భుజాల నొప్పులు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని తెలిపారు. అభిమానులు ప్రేమతో లాగడం వల్ల భుజాలకు గాయాలు అయ్యాయని, స్పైనల్ కార్డ్ సమస్య కూడా ఉండటంతో కొంతకాలం పార్టీ, పాలనకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని, తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తమిళనాడులో కొత్త పార్టీ విజయం సాధించిందని, అదే తరహా పోలికలు తనతో చేయడం సరైంది కాదన్నారు. తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా భిన్నమని చెప్పారు. 2019లో తాను రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయానని గుర్తుచేసుకున్నారు. పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల్లో నలిగి, వారి నమ్మకం సంపాదించాలనే లక్ష్యంతోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నానని అన్నారు.

జనసేన పార్టీని ఏ వింగ్‌కీ పరిమితం చేయలేమని, మంచి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి నేర్చుకునే పార్టీగా ముందుకు వెళ్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సంస్థాగత క్రమశిక్షణ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పెద్ద నాయకులు కూడా సాధారణ కార్యకర్తల మాదిరిగా పని చేసే సంస్కృతి జనసేనలో రావాలని ఆకాంక్షించారు.

కుల రాజకీయాలపై కూడా పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. తాను ఒక కులంలో పుట్టినా అదే కులానికి పరిమితం కాదని, అన్ని వర్గాల కోసం పని చేస్తానన్నారు. కులాల నిర్మూలన జరగాలంటే విద్యార్థుల వసతి గృహాల్లోనే కులాల ఆధారిత విభజన తగ్గాలని అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు కాపుల పేరుతో తనపై విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనన్నారు. వంగవీటి రంగా గారి పేరును రాజకీయంగా వాడుకునేవారు, ఆయనకు ప్రమాదం ఉందన్నప్పుడు ఎందుకు రక్షణగా నిలబడలేదని ప్రశ్నించారు.

మత మార్పిడుల అంశంపైనా స్పందించిన పవన్ కళ్యాణ్.. వ్యక్తిగత విశ్వాసం ప్రకారం మతం మార్చుకోవడంలో తప్పులేదని, కానీ డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టి మార్పిడులు చేయడం అంగీకరించబోమన్నారు. సనాతన ధర్మంపై దాడులు చేయాలని మాట్లాడటం సరైంది కాదన్నారు. వినాయక చవితి వేడుకల్లో భక్తి గీతాల బదులు ఇతర పాటలు వేయడం వంటి అంశాలపై హిందువులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇతర మతాలపై వారికి ఉన్న గౌరవం హిందువులకు కూడా తమ మతంపై ఉండాలని అన్నారు.

దేశ సమగ్రత, జాతీయ అంశాలపై జనసేన ఎప్పుడూ స్పందిస్తుందని తెలిపారు. భారతదేశాన్ని అవమానించే వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. జనసేన ఏడు సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్న ఇంధన పొదుపు చర్యలను ప్రజలు పాటించాలని పవన్ కళ్యాణ్ కోరారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం దేశంపై పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో పనిచేస్తోందన్నారు. ప్రజా రవాణా వినియోగం పెంచాలని, కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని సూచించారు. అంతర్జాతీయ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మోదీపై విమర్శలు చేయడం అరకొర జ్ఞానమని వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గురించి మాట్లాడుతూ, 2024లో రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచనతోనే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. అప్పటి పరిస్థితుల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా మారేదన్నారు. కూటమిలో క్షేత్రస్థాయి ఇబ్బందులు ఉన్నాయనే విషయం తనకు తెలుసని, కానీ జనసేన కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సమస్యలను సరిదిద్దుతానని, కార్యకర్తల కోసం ఎప్పుడూ నిలబడతానని హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin