జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న జనసేన పార్టీ యువజన విభాగాన్ని అధికారికంగా ఆవిష్కరించనున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది.
జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా యువజన విభాగం అధికారిక లోగోతో పాటు గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.
ప్రస్తుతం కేరళలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్.. ఆన్‌లైన్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రత్యేక సందేశం ఇవ్వనున్నారు. యువజన విభాగం ఏర్పాటు వెనుక ఉద్దేశం, దాని లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించే అంశాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది.
పార్టీ యువజన విభాగం ఆవిష్కరణను కేవలం పిఠాపురానికే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహించేందుకు జనసేన ప్రణాళికలు రూపొందించింది. అలాగే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని జనసేన శ్రేణులు కూడా ఇదే రోజున కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా యువతను పార్టీతో మరింతగా అనుసంధానం చేయడంతో పాటు, భవిష్యత్ రాజకీయ కార్యకలాపాల్లో యువశక్తిని కీలకంగా వినియోగించాలనే లక్ష్యంతో జనసేన ముందుకు సాగుతోంది.

