Peddi pre-release event: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిన్న విజయవాడలో అట్టహాసంగా జరిగింది. భారీగా వచ్చిన అభిమానులతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిక్కిరిసిపోయింది.
రామ్ చరణ్ ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ అభిమానులు భారీగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రేక్షకుల ఈలలు, చప్పట్ల హోరు మధ్య 'పెద్ది' ఈవెంట్ కన్నులపండుగగా జరిగింది. జాన్వీ కపూర్ తెలుగులోనే మాట్లాడటం.. జగదేకవీరుడు అతిలోకసుందరిలో డైలాగ్ చెప్పడం ఈవెంట్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే.. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్ సక్సెస్ అయింది కానీ, ఈవెంట్ మేనేజ్ మెంట్ మాత్రం పూర్తిగా విఫలమైందని కామెంట్స్ లేకపోలేదు.
నిర్వాహకులు మొత్తం నాలుగు రకాల పాస్ లు జారీ చేశారు. మెగాపవర్ స్టార్, సెలబ్రిటీ, ఎమ్ఐపీ, వీవీఐపీ. ఇలా నాలుగు రకాల పాస్ లు భారీగా జారీ చేయడంతో అభిమానులే కాకుండా రామ్ చరణ్ ను చూసేందుకు ఫ్యామిలీస్ కూడా కదలివచ్చాయి. అయితే.. కొందరి అత్యుత్సాహంతో తోపులాటలూ జరిగాయి. 4గంటల నుంచీ పోలీసులు స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వగా గేట్ 1లో భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయి ఓదశలో వెళ్లడానికి ఇబ్బందిపడ్డ పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు మొదట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసినా.. సమయం గడిచేకొద్దీ రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో తనిఖీ చేయడం, జనాన్ని నిరోధించడంకానీ వారి వల్ల కాలేకపోయిందనే విమర్శలు వచ్చాయి.
మరోవైపు.. నిర్వాహకులు జారీ చేసిన పాసుల పేర్ల(మెగాపవర్ స్టార్, సెలబ్రిటీ, ఎమ్ఐపీ, వీవీఐపీ)లో మెగా పవర్ స్టార్ కాకుండా మిగిలినవన్నీ పేర్లకు విరుద్ధంగా సీటింగ్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు వైరల్ అయ్యాయి. వీవీఐపీ పాస్ ఉన్నవారిని గ్యాలరీల్లో, ఎమ్ఐపీ కింద స్టేడియంలో, సెలబ్రిటీలు వారికన్నా ముందున్న కుర్చీల్లో కూర్చోబెట్టడం.. జనసందోహాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో చాలామందికి కుర్చీలే దొరకని పరిస్థితి తలెత్తింది. మరోవైపు.. స్టేడియంలో కొంత భాగం బురదతో ఉండిపోయి, ప్రోగ్రామ్ ప్రారంభ సమయంలో కూడా మట్టి వేస్తున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. దీంతో ప్రేక్షకులందరూ ఒకవైపుగా ఏర్పాటు చేసిన ఏరియాలోకే వెళ్లాల్సి వచ్చింది.
దీంతో నిర్వాహకుల తీరుపై విమర్శలొచ్చాయి. రామ్ చరణ్ ను చూద్దామని ఈవెంట్ కు వచ్చిన ఎంతోమంది అభిమానులు, కుటుంబాలు రద్ద తట్టుకోలేక, భయానికిలోనై స్టేడియంలోకి వచ్చికూడా దాదాపు కార్యక్రమం మొదలవకముందే బయటకు వెళ్లిపోయారు. పాస్ లను కూడా బయట బ్లాకులో విక్రయించారని కొందరు అంటున్నారు. అయినా.. ప్రజలు రావడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితులు అదుపు తప్పకుండా చేయగలిగారు. మొత్తంగా కార్యక్రమం సూపర్ హిట్టయినా.. నిర్వాహకుల లోపం స్పష్టంగా కనిపించినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడం సంతోషించే విషయం.

