రైతులను సేంద్రియ సాగువైపు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులోని రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు.
సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ పంటలను మంత్రి పరిశీలించారు. ద్వారకానాథ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి గల కారణాలు, ఎదురైన సవాళ్లు, ప్రస్తుతం లభిస్తున్న ఆదాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో సమీకృత సేంద్రియ సాగు చేస్తున్నట్లు రైతు కుటుంబం వివరించింది.
మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, జామ, నేరేడు, మునగ, రామాఫలం, సీతాఫలం వంటి పంటలతో పాటు నాటుకోళ్ల పెంపకం, చేపల సాగు, పశుపోషణను అనుసంధానం చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నామని రైతులు తెలిపారు. తమ పొలంలోనే సహజ ఎరువులు తయారు చేసుకుంటున్నామని, ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా సాగు చేస్తున్నామని చెప్పారు.
ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం కాపాడటంతో పాటు రైతు పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాయలసీమలో బిందు సేద్యానికి, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్థానిక రైతులను సేంద్రియ సాగు వైపు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన మామిడిని మంత్రి లోకేష్ రుచి చూశారు. అనంతరం ద్వారకానాథ రెడ్డి కుటుంబ సభ్యులు మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. సమీకృత సేంద్రియ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతు కుటుంబాన్ని మంత్రి అభినందించి, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

