Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీవీ సింధు అకాడమీతో భావి ఛాంపియన్లకు బలమైన పునాది: నారా లోకేష్

పీవీ సింధు అకాడమీతో భావి ఛాంపియన్లకు బలమైన పునాది: నారా లోకేష్

విశాఖపట్నంలో నిర్మాణం ప్రారంభమైన పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ దేశానికి భావి ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా నిలవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.

అకాడమీ నిర్మాణ పనులకు భూమిపూజ అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం ఒక క్రీడా అకాడమీ కాదని, వేలాది మంది యువ క్రీడాకారుల కలలకు పునాది వేసే చారిత్రాత్మక ప్రాజెక్ట్ అని అన్నారు.

పీవీ సింధు ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న లోకేష్, ఒక సాధారణ బాలిక నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా ఎదగడానికి ఆమె చూపిన క్రమశిక్షణ, అంకితభావం, త్యాగమే కారణమని కొనియాడారు. ప్రతి పతకం వెనుక క్రీడాకారుడి కష్టం మాత్రమే కాదు, తల్లిదండ్రుల త్యాగం, కోచ్‌ల అంకితభావం కూడా ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సింధు తల్లిదండ్రులు పీవీ రమణ, విజయతో పాటు ఆమెను తీర్చిదిద్దిన ప్రతి కోచ్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులతో జరిగిన సమావేశంలో పీవీ సింధుతో మాట్లాడిన విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. ఇకపై తన లక్ష్యం కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదని, తన అనుభవాన్ని తర్వాతి తరాల క్రీడాకారులకు అందించే వ్యవస్థను నిర్మించడమేనని సింధు చెప్పిన మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో జరిగిన చర్చలో పీవీ సింధు మొదట బ్యాడ్మింటన్ అకాడమీ ఆలోచనను పంచుకున్నప్పటికీ, దానిని అన్ని క్రీడలకు ఉపయోగపడే మల్టీ స్పోర్ట్స్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి నుంచి వచ్చిందని లోకేష్ చెప్పారు. ఆ సూచనతో వ్యక్తిగత కల రాష్ట్ర యువతకు ఉపయోగపడే మహత్తర దార్శనికతగా మారిందన్నారు.

ఈ అకాడమీ కేవలం బ్యాడ్మింటన్‌కే పరిమితం కాదని, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ సహా అనేక క్రీడలకు శిక్షణ అందించే సమగ్ర క్రీడా కేంద్రంగా రూపుదిద్దుకోనుందని వివరించారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ కేంద్రం దేశ నలుమూలల నుంచి యువ క్రీడాకారులను ఆకర్షించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో ప్రవేశపెట్టిన "నో బ్యాగ్ డే" వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తి పెంచుతున్నామని తెలిపారు. తరగతి గది జ్ఞానాన్ని పెంపొందిస్తే, ఆటస్థలం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని అన్నారు.

క్రీడలు కేవలం పతకాలు మాత్రమే ఇవ్వవని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఓటమిని ఎదుర్కొనే ధైర్యం, వినయం వంటి జీవిత విలువలను కూడా నేర్పుతాయని చెప్పారు. ప్రతి చిన్నారి కనీసం ఒక క్రీడలో పాల్గొనాలని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

మహిళల క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న లోకేష్, మరింత మంది బాలికలు క్రీడల్లోకి రావడానికి అవసరమైన వాతావరణం, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా పీవీ సింధు సహకారం ఎంతో కీలకమని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను గొప్ప విద్యార్థులు, పరిశ్రమలు మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దే రాష్ట్రంగా కూడా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రతిభావంతుడైన క్రీడాకారుడికి అవసరమైన సహకారం అందిస్తామని, ప్రతిభ ఉన్న ఏ చిన్నారి అవకాశాల లేమితో వెనుకబడిపోకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రసంగం ముగిస్తూ, ఈ రోజు కేవలం ఒక అకాడమీకి శంకుస్థాపన చేయలేదని, భారతదేశ భావి ఒలింపిక్ ఛాంపియన్లకు బలమైన పునాది వేశామని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin