హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని అరణ్యారామం నందవనంలో నిర్వహించిన 'అశ్వత్థ నారాయణ వివాహం' కార్యక్రమంలో సతీమణి పద్మజతో కలిసి రావి-వేప మొక్కలను నాటిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
భూమాత మనకు ఆహారం, నీరు, గాలి వంటి జీవనాధారాలన్నింటినీ అందించే తల్లితో సమానమని నాగబాబు అన్నారు. అలాంటి ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతేనని పేర్కొన్నారు. అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, ప్రకృతిని కాలుష్యం చేయడం వల్ల భూమాతకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న 'అశ్వత్థ నారాయణ వివాహం' ప్రకృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. రావి, వేప చెట్లను ఒకే చోట నాటే ఈ సంప్రదాయం పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు జీవ వైవిధ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై కూడా నాగబాబు విమర్శలు గుప్పించారు. "గత ప్రభుత్వానికి చెట్లు నరకడం తప్ప, కొత్తగా మొక్కలు నాటాలనే ఆలోచనే రాలేదు. ఏ అభివృద్ధి పనైనా చెట్లను తొలగించడానికే పరిమితమైంది. కానీ కూటమి ప్రభుత్వ సంస్కృతి నరికేది కాదు… నాటేది. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం" అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు కూడా ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక నిబద్ధత ఉందని నాగబాబు తెలిపారు. రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉమ్మడి సంకల్పంతో హరిత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం అరణ్యారామం ప్రాజెక్టు కోసం రూపొందించిన భవన డిజైన్లను నాగబాబు పరిశీలించారు. రూ.24 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనాన్ని 10 నెలల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. నిర్మాణ పనుల కారణంగా తొలగించాల్సి వచ్చిన 73 చెట్లను వేరే ప్రాంతాలకు విజయవంతంగా తరలించి మళ్లీ నాటిన విధానాన్ని నాగబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
https://youtu.be/pzQaM70QqYg

