Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పులివెందుల కార్యకర్త మృతి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు..

పులివెందుల కార్యకర్త మృతి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు..

పులివెందుల నియోజకవర్గంలోని నాగులగుట్టపల్లి ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన కార్యకర్త ముంతల రామాంజులు మృతి చెందిన ఘటనపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాత, పారదర్శక విచారణ జరపాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

చక్రాయపేట మండలం సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లిలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి బంధువు, పార్టీ కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ నాయకుల నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆయన సూచించారు. మృతుడు ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై విచారణ ప్రక్రియను రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమన్వయం చేయాలని తెలిపారు.

అదే సమయంలో ముంతల రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫున అండగా నిలిచేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్‌ను పులివెందులకు పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్న పవన్ కళ్యాణ్, రామాంజులు కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin