Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన 'సతీ లీలావతి' చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు.
దేవ్ మోహన్ హీరోగా నటించారు. సినిమా విడుదలకు ముందు మీడియాతో ముచ్చటించిన లావణ్య త్రిపాఠి కొణిదెల.. సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"'సతీ లీలావతి' మూవీని ఇప్పటికే చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. నేను, నా మేనేజర్ కలిసి చూస్తూ చాలా నవ్వుకున్నాం. కొన్ని చోట్ల మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. మంచి మెసేజ్ ఉన్నా ఎక్కడా క్లాస్ పీకుతున్నట్టు అనిపించదు" అని లావణ్య తెలిపారు.
షూటింగ్ సమయంలోనే తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని ఆమె వెల్లడించారు. "టీమ్ ఇచ్చిన సపోర్ట్ వల్ల షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తయ్యింది. ప్రతిరోజూ షూటింగ్ అయ్యాక హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకునేదాన్ని. ఈ సినిమా కోసం వెయిట్ కూడా తగ్గాను. అప్పటికి నాకు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు. ఇకపై మాత్రం అలాంటి సమయంలో షూటింగ్స్‌కు బ్రేక్ ఇస్తాను" అని చెప్పారు.
ఈ చిత్రంలో తాను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తానని, ఫస్ట్ టైం యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశానని లావణ్య అన్నారు. "కాలితో కొట్టే ఓ సీన్ చేశాను. అప్పుడే కాస్త ఇబ్బంది అనిపించింది. కానీ సినిమా కోసం ఎంతో ఎంజాయ్ చేస్తూ పని చేశాను" అని తెలిపారు.
Ram Charan గురించి మాట్లాడుతూ లావణ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఏమైనా హెల్ప్ కావాలా? ఏదైనా అవసరమా? అని రామ్ చరణ్ గారు మమ్మల్ని ఎప్పుడూ అడుగుతుంటారు. మా సినిమా ట్రైలర్‌ను ఆయన రిలీజ్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన వల్ల సినిమాకు మరింత రీచ్ వచ్చింది" అని చెప్పారు.
హీరో దేవ్ మోహన్ గురించి మాట్లాడుతూ, "ఆయన చాలా మంచి వ్యక్తి. అద్భుతమైన నటుడు. ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు. నేను కూడా నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను" అని తెలిపారు.
Chiranjeevi ఎప్పుడూ కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తుంటారని లావణ్య పేర్కొన్నారు. "ఆయన్ని ప్రమోషన్స్‌కు పిలిస్తే తప్పకుండా వస్తారు. త్వరలో ట్రైలర్ కూడా చూపించాలని అనుకుంటున్నాం" అని చెప్పారు.
ప్రస్తుతం కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదని, తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. "నా భర్త, నా కొడుకుతో సమయం గడపడం చాలా ఆనందంగా ఉంది. కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని అన్నారు.
సీనియర్ నటుడు నరేష్, వీటీవీ గణేష్ వంటి నటులు సినిమాలో అద్భుతమైన పాత్రలు పోషించారని, సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుందని లావణ్య తెలిపారు. "కమల్ హాసన్ గారి 'సతీ లీలావతి' ఒక క్లాసిక్ మూవీ. మా సినిమాను దానితో పోల్చకూడదు. కానీ మా సినిమా మాత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుంది" అని అన్నారు.
భవిష్యత్తులో వరుణ్ తేజ్‌తో కలిసి నటించే అవకాశం ఉందని కూడా ఆమె సంకేతాలు ఇచ్చారు. "మేము రియల్ లైఫ్‌లో కలిసి ఉన్నాం కాబట్టి, తెరపై కూడా కొత్తగా కనిపించే కథ రావాలి. అలాంటి కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తాం" అని లావణ్య త్రిపాఠి కొణిదెల తెలిపారు.

