పంచాయతీలకు రావాల్సిన పన్నులను ఎగవేసే విద్యాసంస్థలు, పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పంచాయతీలు అందిస్తున్న మౌలిక సదుపాయాలు, సేవలను వినియోగించుకుంటూ పన్నులు చెల్లించకుండా తప్పించుకోవడం సమర్థనీయం కాదని ఆయన అన్నారు. పన్ను ఎగవేతల వల్ల గ్రామీణ స్థానిక సంస్థల ఆర్థిక స్థితి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీల పరిధిలో ఉన్న పరిశ్రమలు, విద్యాసంస్థలు, హ్యాచరీలు తదితర సంస్థల నుంచి పన్నుల వసూళ్లపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పంచాయతీల పరిధిలో ఎన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు పనిచేస్తున్నాయి, అవి ఎంత నీటిని వినియోగిస్తున్నాయి, ఎంత వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి, ఎలాంటి సేవలు పొందుతున్నాయి, వాటికి అనుగుణంగా ఎంత పన్ను చెల్లిస్తున్నాయి అనే అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన సాధికార కమిటీని ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, పంచాయతీలకు సరైన పన్నులు చెల్లించడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. నిర్మాణాల విలువను తక్కువగా చూపించడం, పన్ను అంచనాల్లో అవకతవకలకు పాల్పడటం వంటి అంశాలపై రీ-అసెస్‌మెంట్ నిర్వహించాలని ఆదేశించారు. వేలాది మంది విద్యార్థులతో నడుస్తున్న విద్యాసంస్థలు పంచాయతీల సేవలను వినియోగించుకుంటూ పన్నుల విషయంలో మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు.
"ప్రభుత్వ ఉద్యోగి తన జీతంపై పన్ను కడుతున్నాడు. మత్స్యకారుడు కూడా తన వంతు పన్ను చెల్లిస్తున్నాడు. దిగువ మధ్యతరగతి ప్రజలు సైతం పన్నుల భారం మోస్తున్నారు. అలాంటప్పుడు కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్న సంస్థలు ఎందుకు పన్నులు చెల్లించడం లేదు?" అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
డేటా ఆధారిత అంచనాలతో పరిశ్రమలు, హోటళ్లు, విద్యాసంస్థలు ఉత్పత్తి చేసే వ్యర్థాలు, వినియోగించే నీటి పరిమాణం, స్థానిక సంస్థలపై పడుతున్న భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పన్నుల విధానాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. పన్ను ఎగవేతల వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశాలపై కూడా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పంచాయతీలకు రావాల్సిన బకాయిలు భారీ స్థాయిలో ఉన్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పరిశ్రమల నుంచి రూ.115.57 కోట్లు, విద్యాసంస్థల నుంచి సుమారు రూ.45 కోట్లు కలిపి రూ.160 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ నిధులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో తాగునీటి వ్యవస్థల మరమ్మతులు, పారిశుధ్య సేవలు, వీధి దీపాల నిర్వహణ వంటి సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.
కొన్ని పరిశ్రమలు కాలుష్య నియంత్రణతో పాటు స్థానిక పన్నుల విషయంలో కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం లేదా అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా చెట్టినాడ్ సిమెంట్స్ వంటి సంస్థల నుంచి పన్నుల వసూళ్లలో జరిగిన లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా పన్నుల చెల్లింపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించిన పవన్ కళ్యాణ్, పన్ను ఎగవేతదారుల వివరాలు ప్రజలకు తెలిసేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని అన్నారు. సరైన పన్ను వసూళ్లు జరిగితే పంచాయతీలకు వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, తద్వారా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు బలమైన ఆర్థిక వనరులు సమకూరతాయని చెప్పారు.
పంచాయతీల స్వయం సమృద్ధి కోసం కొత్త ఆదాయ మార్గాలను కూడా అన్వేషించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి పంచాయతీలో కలప ఇచ్చే మొక్కలను నాటడం, బిల్‌బోర్డులు, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌లు వంటి వనరులను సమర్థంగా వినియోగించడం ద్వారా స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచాలని పేర్కొన్నారు. గత 30 ఏళ్లలో అన్యాక్రాంతమైన పంచాయతీ ఆస్తులపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల అభివృద్ధికి పన్నుల వసూళ్లు కీలకమని, పన్నులు నిజాయితీగా చెల్లించే సంస్కృతి ఏర్పడితే పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

