సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ 13 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 'మనంసైతం' ఫౌండేషన్ మరో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించింది.
'సపర్య - We Care For Uncared' పేరుతో కొత్త సేవా ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
గత 13 సంవత్సరాలుగా అనాథలు, ఆపదలో ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, సినీ కార్మికులకు 'మనంసైతం' ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాదంబరి కిరణ్ తెలిపారు. సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 'సపర్య' ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అనాథాశ్రమం, వృద్ధాశ్రమంతో పాటు పేదలకు అందుబాటులో ఉండే 'జనతా వైద్యం' ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వైద్యం మాత్రమే కాకుండా, అక్కడ నివసించే వృద్ధులు, అనాథలు ప్రశాంతమైన వాతావరణంలో జీవించేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పెద్ద వాటర్ పాండ్, వాకింగ్ ట్రాక్, పచ్చదనం, విశాలమైన గదులతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
నేటి పరిస్థితుల్లో పిల్లలు ఉద్యోగాల కోసం ఇతర నగరాలు, విదేశాలకు వెళ్లిపోవడంతో అనేక మంది వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారని కాదంబరి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఆశ్రయం, వైద్యం, ఆత్మీయత కల్పించడమే 'సపర్య' ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎవరూ లేని వారికి 'మనంసైతం' తోడుగా నిలవాలన్నదే తమ సంకల్పమని అన్నారు.
విద్యారంగంలో కూడా సేవలను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. 'క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్' భాగస్వామ్యంతో ప్రతి ఏడాది సినీ కార్మికుల ఐదుగురు పిల్లలకు ఉచిత హాస్టల్ వసతితో పాటు రెండేళ్లపాటు నీట్ కోచింగ్ అందించనున్నట్లు చెప్పారు. మరో ఐదుగురు విద్యార్థులకు ఉచిత ఐఐటీ శిక్షణ కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమలో తెర వెనుక పనిచేసే కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు.
తన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని గుర్తు చేసిన కాదంబరి కిరణ్, అదే అనుభవం తనను సేవా మార్గంలో నడిపించిందని చెప్పారు. సమాజంపై అసంతృప్తి పెంచుకోవడం కంటే అవసరంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడంలోనే నిజమైన ఆనందం ఉందని పేర్కొన్నారు. "పేదవాళ్లే నా కుటుంబం. భగవంతుడు మనల్ని ఒక స్థాయికి తీసుకువస్తే, మన చేతనైనంత వరకు మరెందరికో అండగా నిలవాలి" అని అన్నారు.
'సర్వీస్ ఈజ్ గాడ్' అనే నినాదంతో కొనసాగుతున్న 'మనంసైతం' సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాదంబరి కిరణ్ పిలుపునిచ్చారు. దాతలు, సినీ ప్రముఖులు, పరిశ్రమ పెద్దలు 'సపర్య' ప్రాజెక్ట్‌కు మద్దతు అందించాలని కోరారు. అనాథలకు ఆశ్రయం, ఒంటరి వృద్ధులకు ఆత్మీయత, పేదలకు వైద్యం, ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యంతో ప్రారంభమవుతున్న 'సపర్య' ప్రాజెక్ట్ సేవా రంగంలో మరో కీలక అడుగుగా నిలవనుంది.

