Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
"సెలవు అడిగితే ఉద్యోగం తీసేశారు".. టెక్ మహీంద్రా ఉద్యోగిని

"సెలవు అడిగితే ఉద్యోగం తీసేశారు".. టెక్ మహీంద్రా ఉద్యోగిని

మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ఎదుట సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భావన ధర్నాకు దిగారు. తనను ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భావన మాట్లాడుతూ.. అనారోగ్యంతో 13 రోజుల పాటు సెలవు తీసుకున్న సమయంలో కంపెనీ యాజమాన్యం వరుసగా ఈ-మెయిల్స్ పంపిస్తూ వెంటనే ఆఫీసుకు రావాలని ఒత్తిడి తెచ్చిందన్నారు. అనంతరం తన చిన్నారికి ఆరోగ్యం బాగాలేక మరో మూడు రోజుల సెలవు కోరితే, "ఇంకెన్ని రోజులు సెలవులో ఉంటారు?" అంటూ ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కంపెనీలో ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేదని భావన ఆరోపించారు. వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, తాను ఇలాంటి కంపెనీని ఎక్కడా చూడలేదన్నారు. ఒకసారి ఆఫీసులోనే ఆరోగ్యం బాగాలేక కుప్పకూలినా కనీసం పట్టించుకోలేదని, చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించారని ఆరోపించారు.

ఉద్దేశపూర్వకంగానే తనను ఉద్యోగం నుంచి తొలగించారని భావన ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులకు కూడా కుటుంబ బాధ్యతలు ఉంటాయని, ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin