'వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు. ఇద్దరి మధ్యా రాజకీయ పరమైన అభిప్రాయ బేధాలున్నాయి. వేర్వేరు పార్టీల్లో వున్నా, రాజకీయ వైరం వున్నా..
మా మధ్య మానవ సంబంధాలు ఎప్పుడూ దెబ్బ తినలేదు. జగన్ పెళ్ళికీ, షర్మిల పెళ్ళికీ రాజశేఖర్ రెడ్డి నన్ను ఆహ్వానించారు. నేను వెళ్ళాను..' అంటూ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అదినేత నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
'వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి సంబంధించి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి వచ్చారు. ఇందులో రాజకీయమేముంది.? సాక్షి పత్రిక ద్వారా అడ్డమైన రాతలు రాయడమేంటి.?' అని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ పరమైన విభేదాలకీ, మానవ సంబంధాలకీ ముడిపట్టి, కుట్రపూరిత ప్రచారాలు చేయడం సరికాదంటూ హితవు పలికారు చంద్రబాబు.
అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా.. గొడ్డలి పార్టీ నీఛ రాజకీయాల్లో మార్పు రాలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విధ్వంసాలకు పాల్పడిందన్నది చంద్రబాబు ఆరోపణ. స్థానిక ఎన్నికల వేళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.
'సొంత చెల్లిపై అడ్డగోలు రాతల్ని సాక్షిలో రాయిస్తున్నారు వైఎస్ జగన్.. ఇంత దారుణంగా మానవ సంబంధాల్ని అవమానించడమేంటి.?' అని చంద్రబాబు మండిపడ్డారు. ఇటీవల చంద్రబాబుని కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అందించిన సంగతి తెలిసిందే.
అయితే, సాక్షిలో 'చంద్రబాబుతో షర్మిల చెట్టపట్టాల్' అంటూ ఓ లేకి కథనాన్ని వైసీపీ అధినాయకత్వం రాయించింది. సాక్షి మీడియా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే గనుక, ఆ వార్తకీ తమకూ సంబంధం లేదని వైసీపీ అనడానికి వీల్లేని పరిస్థితి.
రాజకీయాలన్నాక విమర్శలు సహజం.! ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు గనుక, తమకు రాజకీయ ప్రత్యర్థిగా షర్మిలను భావించి, ఆమపై వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తే, అది వేరే చర్చ. కానీ, కుమార్తె పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి చంద్రబాబు వద్దకు వెళ్ళిన షర్మిలపై 'చెట్టపట్టాల్' అంటూ వార్తా కథనం రాయడం శోచనీయం.
ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజల్లో పలచనైపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి చంద్రబాబు తాజాగా చెబుతూ, వైఎస్ జగన్ దుర్నీతిని ఎండగట్టడంతో మరింతగా వైసీపీ రాష్ట్ర ప్రజల్లో పలచనైపోయింది.

