Dailyhunt
సింధనూరులో లోకేష్ సందడి. తెలుగు సంఘాల ఘన స్వాగతం

సింధనూరులో లోకేష్ సందడి. తెలుగు సంఘాల ఘన స్వాగతం

TeluguBulletin.com 3 weeks ago

ర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన ఉత్సాహభరితంగా కొనసాగింది. సింధనూరు చేరుకున్న లోకేష్‌కు స్థానిక తెలుగు సంఘాలు, అభిమాన సంఘాలు, యువత భారీగా స్వాగతం పలికాయి.

ఆర్ఎంఎస్ఏ హైస్కూల్ వద్ద జరిగిన ఈ స్వాగత కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ, అభిషేక్ నాడగౌడతో పాటు పలువురు స్థానిక బీజేపీ నాయకులు, ఇతర పార్టీల ప్రతినిధులు కూడా హాజరై లోకేష్‌కు స్వాగతం పలికారు. సభకు హాజరైన ప్రతి ఒక్కరినీ లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ, అభిమానులతో ఫోటోలు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

గతంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ సింధనూరు, రాయచూర్ ప్రాంతాల్లో 53 రోజుల పాటు తెలుగు సంఘాలు, యువత పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం గుర్తుచేశారు. కర్ణాటకలో స్థిరపడిన తెలుగు ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహించి తమ మద్దతు తెలిపిన సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. సింధనూరులోనే సుమారు 10 వేల మందితో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేయనున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. సింధనూరు హోసళ్లీ క్యాంపులోని కమ్మవారి కళ్యాణమండపంలో స్వర్గీయ ఎన్.టి. రామారావు కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు.

అదే విధంగా శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో కూడా లోకేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, పలువురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరుకానున్నారు.
సింధనూరులో లోకేష్ పర్యటన రాజకీయంగా మాత్రమే కాకుండా, కర్ణాటకలోని తెలుగు సమాజంతో అనుబంధాన్ని మరింత బలపరిచే కార్యక్రమంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin